రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. ప్రస్తుతం జట్టులో అందరూ కుర్రాళ్లే కావడంతో బీసీసీఐ ఎవరి మీద నమ్మకం ఉంచుతుందో సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఉన్న సీనియర్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ రాజీనామా చేయగా.. అశ్విన్, జడేజా, రోహిత్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితిలో లేరు. 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు రోహిత్ ను కష్టంగా కెప్టెన్ గా కొనసాగించినా ఆ తర్వాత ఏంటి? అనే సందేహం అలాగే ఉంది.
ఈ నేపథ్యంలో భారత మాజీ టెస్టు బ్యాటర్, ప్రముఖ కామెంటేటర్ టీమిండియా టెస్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ పేరు సూచించాడు. టెస్టు క్రికెట్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గేమ్ ఛేంజర్ అని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్ లాంటి సుదీర్ఘ ఫార్మాట్‌లో యువ ఆటగాడు పంత్.. రోహిత్ శర్మను భర్తీ చేయగలడని చెప్పాడు.
"నేను భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడుతున్నాను. టెస్ట్ ఫార్మాట్ లో పంత్ 24 క్యారెట్స్ గోల్డ్. అతడికి టెస్టు కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. క్రీజ్ లో ఉంటే ఎలాంటి బౌలరైనా అతడిని చూస్తే ఒత్తిడిలోకి వెళ్తాడు. వికెట్ కీపర్ గా తుది జట్టులో ఉంటున్న పంత్ టెస్టు క్రికెట్ బాధ్యతలు ఇస్తే బాగుంటుంది". అని ఆకాష్ చోప్రా తెలియజేశాడు.
గతేడాది రోడ్డు ప్రమాదంలో రోడ్డు ప్రమాదంలో పంత్.. ఫిట్ నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు ప్రకటించిన భారత జట్టులో ఈ లెఫ్ట్ హ్యాండర్ కు చోటు దక్కలేదు. నివేదికల ప్రకారం జనవరి 25 నుంచి భారత్,ఇంగ్లాండ్ మధ్య సిరీస్ కు పంత్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. పంత్ ఐదు టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత జట్టుకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్‌కు కెప్టెన్సీ చేసాడు.