ఆసియా కప్ లో సూపర్-4లో భాగంగా నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య చివరి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే భారత్ ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించగా.. బంగ్లాదేశ్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. దీంతో నామామాత్రంగా జరిగే ఈ వన్డేలో భారత్ తుది జట్టు ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచులో స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్
గాయం కారణంగా పాకిస్థాన్ పై జరిగిన సూపర్-4 మ్యాచుకు అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. వెన్ను నొప్పి కారణంగా ఆ తర్వాత శ్రీలంకపై మ్యాచ్ ఆడని అయ్యర్.. నేటి మ్యాచులో బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది. ఒకవేళ అయ్యర్ తుది జట్టులోకి వస్తే ఎవరు బెంచ్ మీద కూర్చోవాలి అనే ప్రశ్నకు మాజీ భారత బ్యాటర్ ఆకాష్ చోప్రా ఆ త్యాగాన్ని కోహ్లీ కి అప్పగించాడు. ప్రస్తుతం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆకాష్ చోప్రా అయ్యర్ వస్తే కోహ్లీ తుది జట్టులో నుంచి తప్పుకోవాలని సూచించాడు.
ఆ బాధ్యత కోహ్లీదే
ఆకాష్ చోప్రా మాట్లాడుతూ "అయ్యర్ పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే ఆ స్థానంలో ఎవరు తప్పుకోవాలి అనే చర్చ జరుగుతుంది. ఈ విషయంపై పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్లో అనుకోని సమస్య వస్తే ఆ బాధ్యతను పెద్దవారే తీసుకోవాలి. నా సమాధానం మీకు కోపం తెప్పించినా అయ్యర్ నేటి మ్యాచులో ఉండాలంటే కోహ్లీ తప్పుకోవాల్సిందే అని సూచించాడు. ఒకవేళ కోహ్లీ తుది జట్టులో ఉండాలంటే రోహిత్ బెంచ్ కి పరిమితమవ్వాలి అని చెప్పుకొచ్చాడు". మరి ఆకాష్ చోప్రా కామెంట్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.