ఢిల్లీ సీఎం రేసులో ఆతిశీ, సునీత

ఢిల్లీ సీఎం రేసులో ఆతిశీ, సునీత
  • అర్వింద్ కేజ్రీవాల్​తో సిసోడియా, రాఘవ్ చద్దా భేటీ
  • సీఎం ఎంపిక, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • నేడు కేజ్రీవాల్ రాజీనామా
  • లెఫ్టినెంట్ గవర్నర్​ను కలిసి రిజైన్ లెటర్ అందజేయనున్న ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్న నేపథ్యంలో తర్వాత సీఎం ఎవరనే దానిపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నది. కేజ్రీవాల్ భార్య సునీత, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆతిశీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరో ఒకరిని సీఎం చేయాలనే ఆలోచనలో పార్టీ సీనియర్ నేతలు ఉన్నట్లు సమాచారం. మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌‌ సిసోడియా, పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎఫైర్స్​ కమిటీ సభ్యుడు, ఎంపీ రాఘవ్‌‌ చద్దా సోమవారం ఉదయం సీఎం కేజ్రీవాల్‌‌ను ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై చర్చించినట్లు సమాచారం. భేటీ పూర్తయ్యాక ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు పలువురు సీనియర్ నేతలతోనూ సోమవారం సాయంత్రం కేజ్రీవాల్ భేటీ అయ్యారు.

రెండు మూడ్రోజుల్లో ప్రక్రియ పూర్తి

రెండు నుంచి మూడు రోజుల్లో సీఎం ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని ఆప్ నేతలు తెలిపారు. అర్వింద్ కేజ్రీవాల్ రాజీనామాను ఎల్జీ వీకే సక్సేనా ఆమోదించిన వెంటనే శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. ఎన్నికైన నాయకుడి పేరును లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాష్ట్రపతికి అందజేస్తారని తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలు అంతా తమ వెంటే ఉన్నారని, స్పష్టమైన మెజార్టీ కూడా ఉందని చెప్పారు. తాము ఎంపిక చేసిన వ్యక్తి  ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు.

అతిశీ, పీడబ్ల్యూడీ మంత్రి 

ఎడ్యుకేషన్, పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా ఆతిశీ పని చేస్తున్నారు. ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నది. ఢిల్లీ స్టూడెంట్లకు మెరుగైన విద్యనందించాలన్న ఆప్ టార్గెట్​కు అనుగుణంగా 43 ఏండ్ల ఆతిశీ పని చేశారు.  కల్కాజీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కేజ్రీవాల్, సిసోడియా అరెస్ట్ తర్వాత పార్టీని ముందుండి నడిపించారు. కేంద్ర వైఖరికి నిరసనగా దీక్ష చేశారు.

సౌరభ్ భరద్వాజ్, హెల్త్ మినిస్టర్

ఆప్ సీనియర్ నేత, గ్రేటర్ కైలాశ్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సౌరభ్ భరద్వాజ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. విజిలెన్స్, హెల్త్ మినిస్టర్​గా పని చేస్తున్నారు. లిక్కర్ కేసులో సిసోడియా అరెస్ట్ తర్వాత ఈయన పేరు కూడా వినిపించింది. గతంలో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పని చేశారు. గతంలో 49 రోజుల కేజ్రీవాల్ గవర్నమెంట్​లోనూ మంత్రిగా ఉన్నారు. ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.

సీఎం రేసులో సీనియర్ నేతలు

సీఎం రేసులో గోపాల్‌‌ రాయ్‌‌, ఎంపీలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మంత్రులు కైలాశ్‌‌ గెహ్లాత్, ఇమ్రాన్‌‌ హుస్సేన్‌‌ పేర్లూ తెరపైకొచ్చాయి. దళిత నేతనుగానీ, మైనారిటీ నేతనుగానీ సీఎంను చేసే అవకాశాలూ లేకపోలేదనే చర్చ జరుగుతున్నది. ఎవరైనా కూడా కొన్ని నెలల పాటు మాత్రమే సీఎంగా ఉంటారు. నాయకత్వాన్ని బలోపేతం చేసి పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే సమర్థుడైన నేతను సీఎంగా ఎన్నుకోవాలని ఆప్ భావిస్తున్నది. ప్రధానంగా ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలోనూ ఆతిశీ, 
సౌరభ్​ భరద్వాజ్ ముందు వరుసలో ఉన్నారు.

నేడు ఎల్జీ వీకే సక్సేనాతో కేజ్రీవాల్ భేటీ

అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు తెలిపా యి. సాయంత్రం 4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో ఆయన భేటీ కానున్నా రు. ఈమేరకు అపాయింట్​మెంట్ కూడా ఫిక్స్ అయినట్లు ఆప్ నేతలు తెలిపారు. ఎల్జీతో భేటీ అయి రిజైన్ లెటర్ అందజేస్తారని సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్​పై బయటికి వచ్చిన కేజ్రీవాల్.. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆదివారమే చెప్పారు. 

పార్టీ నేతల్లో ఒకరిని సీఎంగా ఎన్నుకుంటామని కూడా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఎవరికి సీఎం పదవి దక్కుతుందనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. కాగా, షెడ్యూల్ ప్రకారం వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. కానీ.. నవంబర్​లో మహారాష్ట్రకు జరిగే ఎన్నికలతో పాటు ఢిల్లీకి కూడా నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అయితే, ఢిల్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధంగా లేనట్లు తెలుస్తున్నది.