- మహిళలు, బలహీన వర్గాలే టార్గెట్‌గా తాయిలాలు
- జోరుగా కేజ్రీవాల్ ప్రచారం
న్యూఢిల్లీ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఆయా పార్టీల ప్రచారం జోరందుకుంది. దేశంలో అతి పెద్ద స్టేట్‌గా, జాతీయ రాజకీయాల్ని శాసించే యూపీపై నేషనల్ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, రీజినల్ పార్టీలు బీఎస్పీ, ఎస్పీ ఫోకస్ పెడితే.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధానంగా పంజాబ్, గోవాపై ఫోకస్ పెట్టింది. ఢిల్లీ మోడల్ ను ముందు పెట్టి.. రెండు రాష్ట్రాల్లోనూ పవర్‌ను చేజిక్కించుకునేందుకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పంజాబ్‌లో ఆప్ దే హవా
2017 నాటి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లను గెలుచుకున్న ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇదే ఊపుతో ఈసారి పవర్‌ను చేజిక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎన్నికల షెడ్యూల్ రాగానే కేజ్రీవాల్ మొదట పంజాబ్‌లోనే పర్యటించారు. పంజాబీల అభివృద్ధి కోసం10 పాయింట్ల ప్లాన్‌ను విడుదల చేశారు. ఇందులో మహిళలు, పేద వర్గాలు, నిరుద్యోగుల ఓట్లే టార్గెట్‌గా ప్రచారం చేశారు. ఈక్వేషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకుని సీట్లు కేటాయించారు. సీఎం క్యాండిడేట్ ఎంపిక కోసం టెలీ ఓటింగ్ నిర్వహించి కొత్త చర్చకు తెరలేపారు. మరోవైపు కాంగ్రెస్‌లో సీఎం చన్నీ, పీసీసీ ప్రెసిడెంట్ సిద్ధూ మధ్య గొడవ, అమరీందర్ కొత్త పార్టీ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు కష్టమని భావిస్తున్నారు. అగ్రి చట్టాల వల్ల రాష్ట్రంలో బీజేపీ నామమాత్రంగా మారింది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే పంజాబ్‌లో ఆప్ జెండా ఎగిరే అవకాశాలే ఎక్కువని అంటున్నారు.
ఢిల్లీ మోడల్ ఇదే..
సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్, మొహల్లా క్లినిక్స్ ఏర్పాటుతో ప్రతి గల్లీలోని పేదలకూ మంచి వైద్యం, ఫ్రీ వాటర్, బస్సుల్లో మహిళ లకు ఫ్రీ జర్నీ వంటి స్కీంల వల్లే ఢిల్లీలో ఆప్ మూడోసారి అధికారంలోకి వచ్చిం ది.
గోవాలో 13 పాయింట్ల ప్లాన్..
ఢిల్లీ తరహాలో గోవాను కూడా అభివృద్ధి చేస్తామని కేజ్రీవాల్ ప్రచారంలో పదేపదే చెప్తున్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, 18 ఏండ్లు నిండిన మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలతో 13 పాయింట్ల విజన్ ప్లాన్ ను ప్రకటించారు.