ప్రతిపక్షాల భేటీకి హాజరైతం: ఆప్​

  • ఆర్డినెన్స్‌‌ వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై హర్షం

న్యూఢిల్లీ: బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల మీటింగ్‌‌‌‌కు హాజరవుతామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఢిల్లీలో అధికారుల బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్‌‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతిస్తామని కాంగ్రెస్ చెప్పిన తర్వాత ఈ ప్రకటన చేసింది.  ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్‌‌‌‌ అర్వింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌‌ తర్వాత ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా క్లారిటీ ఇచ్చారు. 

‘‘ఆప్‌‌ పీఏసీ ఆదివారం సమావేశమైంది. విస్తృతంగా చర్చలు జరిపింది. తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన(ఉద్ధవ్) తదితర పార్టీలన్నీ దేశ వ్యతిరేక ఆర్డినెన్స్‌‌ను వ్యతిరేకించాయి. ఆ ఆర్డినెన్స్‌‌ను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలను మేం చేస్తాం’’ అని చెప్పారు. తమ పోరాటానికి కాంగ్రెస్ మద్దతివ్వడం సానుకూల పరిణామమని అన్నారు. 17, 18వ తేదీల్లో బెంగళూరులో జరగనున్న ప్రతిపక్షాల సమావేశంలో కేజ్రీవాల్ నేతృత్వంలో  ఆప్ పాల్గొంటుందని వెల్లడించారు.

కేంద్రం ఆర్డినెన్స్‌‌ను వ్యతిరేకిస్తున్నం: కాంగ్రెస్

ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులను నియంత్రించే కేంద్ర ఆర్డినెన్స్‌‌ను తాము సపోర్ట్ చేయబోమని కాంగ్రెస్‌‌ స్పష్టం చేసింది. ఫెడరలిజాన్ని విధ్వంసం చేసే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని చెప్పింది. పార్లమెంటులో ఇందుకు సంబంధించిన బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టినా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను గవర్నర్ల ద్వారా నడిపించాలనే కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నామన్నారు.  

ALSO READ :బోనమెత్తిన భాగ్యనగరం​.. నగరంలో ఘనంగా వేడుకలు

కాంగ్రెస్‌‌లో రాజకీయ గందరగోళం: బీజేపీ

కాంగ్రెస్‌‌ పార్టీని రాజకీయ నిరాశ, గందరగోళం పట్టి పీడిస్తోందని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘‘ఐక్యతలేని కాంగ్రెస్‌‌ పార్టీ.. బెంగళూరులో విచ్ఛిన్నమైన ప్రతిపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. కానీ అంతకన్నా ముందు తన సొంత పార్టీలోని విభేదాలను సరిదిద్దుకోవాలి. ఢిల్లీ సర్వీస్ ఆర్డినెన్స్‌‌ అంశంపై పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ బజ్వా ‘‘కాంగ్రెస్ మద్దతు పొందే అర్హత ఆప్‌‌నకు లేదు” అని చెబుతారు. 

అజయ్‌‌ మాకెన్.. ‘‘ఆప్‌‌నకు మద్దతు ఇవ్వకూడదు” అంటారు. ఈరోజు కేసీ వేణుగోపాల్ మాత్రం ఆప్‌‌నకు మద్దతు ఇస్తున్నామని చెబుతారు” అని బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ విమర్శించారు.