- పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్‌కు లేఖ
- ఢిల్లీ సర్కారు అసంపూర్తి వాగ్దానాలు చేస్తున్నది
- తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నది
- బీజేపీ డర్టీ పాలిటిక్స్‌కు ఇదే నిదర్శనం: ఆప్
- ఆప్ మునిగిపోయే పడవ అని తెలిసి దిగిపోతున్నారు: బీజేపీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు అతి కొన్ని నెలలముందే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్లీడర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కైలాశ్ గెహ్లాట్ ఆప్‌కు గుడ్ బై చెప్పారు. ఆదివారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కైలాశ్ గెహ్లాట్.. కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ సర్కారు అసంపూర్తి వాగ్దానాలు ఇస్తున్నదని, యమునా నది ప్రక్షాళనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
యమునా నదిని క్లీన్ రివర్‌గా మారుస్తామని హామీ ఇచ్చిన ఆప్.. దాన్ని నిలబెట్టుకోలేదని, దీంతో ముందటికంటే యమునా నది ఎక్కువగా కలుషితమైందని చెప్పారు. శీష్మహల్లాంటి వివాదాల తర్వాత కూడా ఇంకెవరైనా ఆప్‌ను నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలని నిబద్ధతతో ఆప్ ఏర్పడిందని, కానీ.. ఆప్ ఆశయాలను ఆ పార్టీ నేతల రాజకీయ ఆశయాలు అధిగమించాయని మండిపడ్డారు.
ఆప్ ప్రజల కోసం పోరాడకుండా.. తన సొంత రాజకీయ ఎజెండా కోసం పోరాడుతున్నదని ఆరోపించారు. ఢిల్లీ సర్కారు కేంద్రంతో పోరాడేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తే.. ఢిల్లీ పురోగతి సాధ్యం కాదని అన్నారు. కాగా, గెహ్లాట్ రాజీనామాపై మాట్లాడేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు.
కైలాశ్ గెహ్లాట్ రాజీనామా ఆమోదం!
ఆప్ సభ్యత్వానికి రాజీనామా చేసిన నజఫ్‌గఢ్ ఎమ్మెల్యే, ట్రాన్స్పోర్ట్ మినిష్టర్ కైలాశ్ గెహ్లాట్ వెంటనే కౌన్సిల్ఆఫ్ మినిస్టర్‌కు కూడా రిజైన్ చేశారు. ఆయన రాజీనామాను ఢిల్లీ సీఎం ఆతిశి ఆమోదించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, గెహ్లాట్ ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారని, ఆయనకు బీజేపీలో చేరడం తప్ప వేరే మార్గం లేదని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఇది బీజేపీ డర్టీ పాలిటిక్స్‌కు నిదర్శనమని, ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలువాలని అనుకుంటున్నదని ఆరోపించారు.
బీజేపీ దిగజారుడు రాజకీయాలతో కుట్రలను విజయవంతంగా అమలుచేస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు. బీజేపీ ఒత్తిడితోనే కైలాశ్ గెహ్లాట్ రాజీనామా చేశారని ఆరోపించారు. ఐదేండ్లు ఆప్‌పై గెహ్లాట్ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే ఆప్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
గెహ్లాట్ రాజీనామాను స్వాగతించిన బీజేపీ
కైలాశ్ గెహ్లాట్ రాజీనామా చేయడాన్ని బీజేపీ స్వాగతించింది. కేజ్రీవాల్, ఆప్‌పై బీజేపీ పోరాడుతున్న సమస్యలనే గెహ్లాట్ లేవనెత్తారని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ అన్నారు. కేజ్రీవాల్‌ను ఆప్‌లోని నేతలు కూడా నమ్మరని ఈ రాజీనామాతో తేలిపోయిందన్నారు. ఆప్ మునిగిపోయే పడవ అని అర్థమవుతున్నందున.. కేజ్రీవాల్‌తో ఉన్న ప్రతి ఒక్కరూ బయటకు వచ్చేస్తున్నారని చెప్పారు. కాగా, ఆమ్ఆద్మీ పార్టీ ఇప్పుడు ఖాస్ (ప్రత్యేకమైన)ఆద్మీ పార్టీ గా మారిపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. ఆ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.