Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్

Champions Trophy 2025: ‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’: సెలెక్టర్లను ఏకిపారేసిన పాక్ పేసర్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) శుక్రవారం ప్రకటించింది. రిజ్వాన్ నాయకత్వంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. జట్టు ఎంపిక ఎలా ఉన్నా.. ఆ 15 మందిలో తన పేరు లేకపోవడంపై ఓ పేసర్ తన బాధను బయటకు వెళ్లగక్కాడు. జట్టులో చోటు కల్పించకుండా సెలక్టర్లు తనకు ద్రోహం చేశారని ఆల్‌రౌండర్ అమీర్ జమాల్ ఆరోపించాడు.

నమ్మించి మోసం చేశారు.. 

‘ద్రోహానికి ముఖం ఉంటే.. అది పాకిస్థానే..’... జట్టు ప్రకటన జరిగిన కొద్దిసేపటికే అమీర్ జమాల్ తన ఇన్‌స్టాగ్రమ్ స్టోరీస్‌లో పోస్ట్‌లో ఈ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టును బట్టి అతడు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డును, బోర్డు సెలెక్టర్లను తిడుతున్నాడని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అతనికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఉంటుందని సెలెక్టర్లు హామీ ఇచ్చారట. చివరి క్షణంలో అతన్ని తప్పించి.. సీనియర్  ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ కు చోటు కల్పించారు. జట్టు ఎంపికలో రాజకీయం జరిగిందన్నది అతని వాదన. ఈ పోస్టుపై ఆ దేశ మీడియాలో ఉదయం నుంచి వార్తలొస్తున్నా.. పీసీబీ నోరు మెదపక పోవడం గమనార్హం.

28 ఏళ్ల అమీర్ జమాల్.. నమ్మకమైన ఆల్‌రౌండర్. బౌలింగ్‌తో పాటు ఆఖరి ఓవర్లలో విలువైన పరుగులు చేయగల సమర్థుడు. గతేడాది నవంబర్‌లో జింబాబ్వేలో జరిగిన సిరీస్‌ ద్వారా ఈ పేసర్ పాక్ తరుపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‪ల్లో 3 వికెట్లు పడగొట్టాడు. దాంతో, పాక్ వన్డే జట్టులో రెగ్యులర్‌ ప్లేయర్‌గా మారాడు.

ALSO READ | IND vs ENG: ఇండియా తొండాట ఆడి గెలిచిందా..! ఏంటి ఈ వివాదం..?

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ ట్రై సిరీస్‌లో దాయాది దేశం ఇదే జట్టుతో బరిలోకి దిగనుంది. ట్రై సిరీస్ ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానుంది. 

ఇక ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికొస్తే.. టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి షురూ కానుంది. భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి.. వేదికలు.

ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు:

మహమ్మద్ రిజ్వాన్(కెప్టెన్), బాబర్ ఆజామ్, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, టయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, కుష్‌దిల్ షా, సల్మాన్ అఘా(వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రర్ అహ్మద్, షాహిన్ షా అఫ్రిది, హ్యారీస్ రౌఫ్, మహమ్మద్ హస్‌నైన్, నసీమ్ షా.