AUS vs PAK: ఒక్కడే వణికించాడు: ఆసీస్‌కు పీడకలలా మారిన పాక్ అనామక క్రికెటర్

AUS vs PAK: ఒక్కడే వణికించాడు: ఆసీస్‌కు పీడకలలా మారిన పాక్ అనామక క్రికెటర్

ఆస్ట్రేలియా పర్యటనలో ఆసీస్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి సిరీస్ సొంతం చేసుకున్నప్పటికీ అంచనాలు లేని ఒక అనుమాక క్రికెటర్ ఆసీస్ గడ్డపై అత్యద్భుతంగా రాణిస్తున్నాడు. కంగారూలపై విశ్వరూపం చూపిస్తూ ఒక్కడే పోరాడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ పాక్ క్రికెటర్ కు కొత్త ఆశాకిరణంలా నిలిచాడు. తాజాగా సిడ్నీ టెస్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. టెస్ట్ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న అతడి పేరు అమీర్ జమాల్. 

సిడ్నీ వేదికగా ప్రస్తుతం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ పై పాక్ స్వల్ప ఆధిక్యం సంపాదించింది. దీనికి కారణం అమీర్ జమాల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట బ్యాటింగ్ లో 82 పరుగులు చేసిన అమీర్.. బౌలింగ్ లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. 

ఈ సిరీస్ ఆసాంతం రాణించిన అమీర్.. ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. ఆస్ట్రేలియాలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 125 పైగా పరుగులు, 15కు పైగా వికెట్లు తీసిన విజిటింగ్ ప్లేయర్‌ల ఎలైట్ లిస్టులో జమాల్ చేరాడు. అమీర్ జమాల్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది.  

ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. ఒక దశలో 227 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్ అమీర్ జమాల్ బ్యాట్ తో చెలరేగాడు. బౌండరీల మోత మోగిస్తూ ఆసీస్ బౌలర్లందరకూ చుక్కలు చూపించాడు. 97 బంతుల్లో 82 పరుగులు చేసి ఆసీస్ కు దడ పుట్టించాడు. 

జమాల్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉండడటం విశేషం. ఈ బౌలర్ వీరోచిత ఇన్నింగ్స్ తో పాక్ 313 పరుగులకు ఆలౌటైంది. మీర్  హంజాతో కలిసి 86 పరుగులు జోడించి పాక్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. జమాల్ ఈ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా గడ్డపై 9 వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన పాక్ ఆటగాడిగా అరుదైన రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు.