Laapataa Ladies: ఆస్కార్ 2025 'లాపతా లేడీస్' టైటిల్‌ చేంజ్.. ఇలా సడెన్గా ఎందుకు మార్చారంటే?

Laapataa Ladies: ఆస్కార్ 2025 'లాపతా లేడీస్' టైటిల్‌ చేంజ్.. ఇలా సడెన్గా ఎందుకు మార్చారంటే?

'లాపతా లేడీస్’ (Laapataa Ladies).. భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ 2025 బరిలో ఈ మూవీ నిలిచిన విషయం తెలిసిందే. మార్చి 1న థియేటర్లలో రిలీజైన లాపతా లేడీస్ సినిమాలో..సమాజంలో మహిళల పరిస్థితులను చూపిస్తూ తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా మూవీపై చాలా ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించారు. 

ఈ నేపథ్యంలో 'లాపతా లేడీస్’ మూవీ మేకర్స్ ‘ఆస్కార్‌’ క్యాంపెయిన్‌' ను షురూ చేసింది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్‌ను ‘లాస్ట్‌ లేడీస్‌’ (Lost Ladies) అనే పేరు ఖరారు చేస్తూ ఆమిర్ ప్రొడక్షన్ హౌస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదిక నుండి కొత్త పోస్టర్‌ రిలీజ్ చేశారు.

కాగా ఈ మేరకు మంగళవారం (నవంబర్ 12న) ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ ను న్యూయార్క్‌లో చెఫ్ వికాస్ ఖన్నాలో నిర్వహించారు. ఇందులో ఆమిర్‌ ఖాన్‌, కిరణ్‌ రావు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లాపతా లేడీస్ మూవీ ఏంటంటే?

లాపతా లేడీస్ ఓ సెటైరికల్ కామెడీ మూవీ. ఈ ఏడాది 2024 మార్చి 1న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అయితే ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ..గత ఇండియన్ సినిమాల రికార్డులు బ్రేక్ చేసింది.

అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీగా నెట్‌ఫ్లిక్స్ లో చరిత్ర సృష్టించింది. యానిమల్ లాంటి కమర్షియల్ సినిమాలను కూడా వెనక్కి నెట్టింది.అంతేకాదు  భారత దేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఫస్ట్ టైం ప్రదర్శించిన మూవీగా నిలిచింది.

సుప్రీం కోర్టు ఏర్పడి 75 ఏళ్లు సందర్భంగా ఈ సినిమాను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించారు. 

లాపతా లేడీస్ కథ:

2001 సంవత్సరం బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు, కుటుంబ గౌరవం పేర్లతో అమ్మాయిల ఆకాంక్షలు, లక్ష్యాలు, సంతోషాలు ఎలా అణచివేతకు గురవుతున్నాయో ఈ మూవీలో దర్శకురాలు కిరణ్ రావ్ కళ్ళకు కట్టినట్లుగా తెరకెక్కించారు.

పెళ్లి చేసుకొని అత్తవారింట్లో సేవలు చేసేందుకు అమ్మాయిలు ఉన్నారని గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు కుటుంబ సభ్యులు ఎలా ఆలోచిస్తారోననే అంశాన్ని కూడా బలంగా తెరకెక్కించారు. లాపతా లేడీస్ సినిమా ఎక్కువగా సరదాగానే సాగుతుంది. అయితే, చివరి 20 నిమిషాలు ఈ మూవీకి మరింత బలాన్ని తెచ్చిపెడతాయి. ఎమోషనల్‍గా సాగుతుంది. మనసుకు తాకేలా సీన్లు ఉంటాయి.

ఈ సినిమా ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది. లోతైన విషయాలను ఎంటర్‌టైనింగ్‍గా తెరకెక్కించడంతో ఎక్కడా బోర్ కొట్టదు. ప్రస్తుతం  నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా ఉంది. ఇప్పటి వరకూ చూడకపోతే వెంటనే ఈ సినిమాను చూసేయండి.