
రామాయణం ఆధారంగా రణబీర్ కపూర్, సాయిపల్లవి జంటగా ‘రామాయణ’చిత్రం తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా హ్యూజ్ బడ్జెట్‌తో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే త్వరలోనే మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నట్టు ఆమీర్ ఖాన్ ప్రకటించారు.
నిజానికి ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎప్పటినుంచో చెబుతున్న ఆమీర్ ఖాన్ ఇప్పుడు నిర్మాతగా ఓ అడుగు ముందుకేశారు. ఈ ఏడాది నుంచి ఆ పనులు ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.
ఒకే సినిమాలో మొత్తం భారతాన్ని చూపించలేం కనుక సిరీస్‌లుగా ప్లాన్ చేస్తున్నామని, దీని రచనకే కొన్నేళ్లు పడుతుందని ఆయన చెప్పారు. ఇందులో తాను నటిస్తానా లేదా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేనని, రైటింగ్ వర్క్ పూర్తయ్యాక ఏ పాత్రకు ఎవరైతే బాగుంటుందో ఎంపిక చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
అంతేకాదు.. దీన్ని ఏ ఒక్క దర్శకుడి చేతిలో పెట్టడం కాకుండా చాలామంది దర్శకులు దీనిపై వర్క్ చేయబోతున్నట్టు ఆమీర్ చెప్పారు. ఇక రాజమౌళి కూడా మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఎప్పటికైనా అది తెరకెక్కించి రిటైర్ అయిపోతానని చాలా సందర్భాల్లో చెప్పారు.
దానికి ఇంకా చాలా టైమ్ ఉంది కనుక ఈలోపు ఆమీర్ ఖాన్ తీసే ‘మహాభారత్’లో రాజమౌళి భాగమయ్యే అవకాశాలు లేకపోలేదు. పైగా ఇది సిరీస్ కనుక ఇందులోని ఏదైనా పార్ట్‌ను రాజమౌళి డైరెక్ట్ చేయొచ్చు. మరి ఆ వైపుగా ఆమీర్ ఖాన్ ప్లాన్ చేస్తారేమో చూడాలి!