- ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి దాడి చేయించారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం చేస్తుండగా తన వెహికల్ పై జరిగిన రాళ్లదాడిపై ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ స్పందించారు. అలాంటి భయంకరమైన ప్రచారాన్ని ఢిల్లీ ప్రజలు ఎప్పుడూ చూడలేదని అన్నారు.
ఒక మాజీ సీఎం అయిన తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, ఇది బీజేపీ నేతల పనేనని ఆయన ఆరోపించారు. తనపై ఎన్ని దాడులు జరిగినా భయపడబోనని, తన జీవితం దేశానికే అంకితం చేశానని చెప్పారు.
ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతుంది. ఈ విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. అందుకే ఫ్రస్ట్రేషన్ లో వారు నాపై హత్యాయత్నానికి ఒడిగట్టారు.
వారు ప్రచారం చేసే తీరు అలాగే ఉంటుంది” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ సీటును 20 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోతారని ఆ స్థానం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేసిన వ్యాఖ్యపైనా ఆయన స్పందించారు. పర్వేశ్ వర్మ కలలు కంటున్నారని, ఆయనను అలాగే బతకనివ్వాలని ఎద్దేవా చేశారు.