న్యూఢిల్లీ: ఆప్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం ఈసీకి లేఖ రాశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో స్వతంత్ర పరిశీలకులను నియమించాలని కోరారు. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన బీజేపీ వర్కర్లను అరెస్టు చేయాలన్నారు. దాడులను నిలువరించడంలో విఫలమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. రోహిణి ఏరియాలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆప్ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్‌పై దాడి జరిగిందని తెలిపారు.
సెక్టార్ 11లోని పాకెట్ హెచ్ నివాసులతో గోయల్ మాట్లాడుతుండగా ఆయనపై దాడి చేశారని చెప్పారు. అంతకు ముందే శనివారం రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈసీకి లేఖ రాశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రచారం చేయకుండా ఆప్ కార్యకర్తలపై బీజేపీ వర్కర్లు దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.