ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ సీఎం ఇంట్లో ఈసీ రైడ్స్.. ఈసీ తీరుపై ఆప్ ఫైర్..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ సీఎం ఇంట్లో ఈసీ రైడ్స్.. ఈసీ తీరుపై ఆప్ ఫైర్..

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆప్ పార్టీలో కలకలం రేగింది. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఢిల్లీ కపూర్తలాలోని మాన్ నివాసంలో ఎన్నికల సంఘం టీం సోదాలు జరిపింది. ఈ పరిణామంపై ఢిల్లీ సీఎం అతీషి ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.

ఓటర్లకు పట్టపగలు బహిరంగంగా, నిస్సిగ్గుగా డబ్బులు, షూస్ పంచుతూ బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుంటే ఎన్నికల సంఘానికి అది కనిపించడం లేదని, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇంటికి రైడ్స్కు వెళ్లారని ఆమె ఈసీ తీరుపై మండిపడ్డారు. ‘వావ్ బీజేపీ.. ఢిల్లీ ప్రజలు ఇందుకు ఫిబ్రవరి 5న సరైన సమాధానం ఇస్తారు’ అని ఢిల్లీ సీఎం అతీషి ట్వీట్ చేశారు.

పంజాబ్ ప్రభుత్వ స్టిక్కర్, రిజిస్ట్రేషన్ నంబర్తో కూడి ఒక ప్రైవేట్ వాహనాన్ని ఢిల్లీ పోలీసులు సీజ్ చేసిన మరుసటి రోజే పంజాబ్ సీఎం ఇంట్లో సోదాలు జరగడం గమనార్హం. ఢిల్లీలోని పంజాబ్ భవన్ ముందు లిక్కర్, డబ్బు, ఎన్నికల ప్రచార సామగ్రితో కూడిన ఒక వాహనం పార్క్ చేసి ఉండటాన్ని గమనించిన ఢిల్లీ పోలీసులు ఆ వెహికల్ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఫిబ్రవరి 23తో ముగియనుంది.

ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
* పోలింగ్ తేది: ఫిబ్రవరి 5
* ఫలితాలు: ఫిబ్రవరి 8