- ఓటర్ లిస్ట్ లో బీజేపీ అక్రమాలు పాల్పడుతోంది
- ఢిల్లీ ఓటర్ లిస్ట్‌లో అవకతవకలు
- ఈసీకి కేజ్రీవాల్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: తాను పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల లిస్టులో బీజేపీ అక్రమాలకు పాల్పడుతున్నదని ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిపై ఆయన గురువారం ఈసీకి ఫిర్యాదు చేశారు.
బీజేపీకి చెందిన 13 వేల మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారన్నారు. అలాగే, ఆప్ కు చెందిన 5,500 మంది ఓటు హక్కును రద్దు చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.
‘‘గత 22 రోజుల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 5,500 మంది ఓటర్లు వారి ఓటు హక్కును తొలగించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం లక్ష ఓట్లలో ఇది 5.5 శాతం.
వీటిపై సంబంధిత వ్యక్తులను ఈసీ సంప్రదించినప్పుడు 89 మంది ఓటర్లు మేము మా ఓటును తొలగించుకునేందుకు దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. దీంతో ఇది స్కామ్ అని స్పష్టంగా అర్థమవుతోంది.
అలాగే, గత 15 రోజుల్లో కొత్తగా 13 వేల మంది తమ ఓటును రిజిస్టర్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఓట్ల తొలగింపులు, చేరికలు చూస్తుంటే స్కామ్ చేస్తున్నారని అర్థమవుతోంది’’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు