న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి తన అవసరం లేదని, దానికి రాహుల్ గాంధీ చాలు అని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. బీజేపీకి బీ టీమ్ గా ఆప్ వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ ను బలహీన పరచడమే ధ్యేయంగా ఆప్ పని చేస్తోందన్న రాహుల్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ ఖండించారు. కాంగ్రెస్ ను బలహీన పరచాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను వ్యతిరేకించడమంటే బీజేపీకి సపోర్ట్ చేసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేంగా తమ పార్టీ పని చేస్తుందని కేజ్రీవాల్ అన్నారు.
బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని కేజ్రీవాల్ అన్నారు. ఎమ్మెల్యేలను కొనడం, ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూలగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు రూ. 8 వేల కోట్లు ఖర్చు పెట్టి 285 ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని మండిపడ్డారు. ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుందని ఆయన ప్రశ్నించారు.