న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేసింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ ఇప్పటికే 32 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన ఆప్.. మిగిలిన 38 స్థానాలకు ఆదివారం (డిసెంబర్ 15) క్యాండిడేట్ల పేర్లును ఆప్ ప్రకటించింది.
38 మంది పేర్లతో తుది జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఆప్ కీలక నేతల పేర్లు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నాయి. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పోటీ చేసే స్థానం తుది జాబితాలో ఖరారైంది. వచ్చే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం బరిలోకి దిగుతుండగా.. ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిశీ మరోసారి కల్కాజీ నుంచి పోటీ చేయనున్నారు. మరో కీలక నేత సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ స్థానం నుండి అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.
ALSO READ | బెంగళూరు టెకీ కేసులో కీలక పరిణామం.. అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా అరెస్ట్..
కస్తూర్బా నగర్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ లాల్ స్థానంలో ఇటీవల బీజేపీ నుంచి ఆప్‌లో చేరిన రమేష్ పెహ్ల్వాన్కు టికెట్ ఇచ్చారు. బాబర్‌పూర్ నుండి గోపాల్ రాయ్, ఓఖ్లా నుండి అమానతుల్లా ఖాన్, షకుర్ బస్తీ నుండి మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ బరిలోకి దిగనున్నారు. ఈ సారి 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆప్ టికెట్ నిరాకరించింది. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలకు బదులు వారి కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయించింది ఆప్.
కేజ్రీవాల్ వర్సెస్ సందీప్ దీక్షిత్:
కేజ్రీవాల్ పోటీ చేసే నియోజకవర్గం ఫైనల్ లిస్ట్‌లో ఖరారు కావడంతో ఆయన ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతుండగా.. న్యూఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరుఫున సందీప్ దీక్షిత్ పోటీ చేయనున్నాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడే ఈ సందీప్ దీక్షిత్.
ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ 2013, 2015 ఎన్నికల్లో న్యూఢిల్లీ సీటులో కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో తన తల్లి కంచు కోట నుంచి బరిలోకి దిగుతోన్న సందీప్.. తన తల్లిని ఓడించిన కేజ్రీవాల్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. సందీప్ దీక్షిత్‌కు ఇది రాజకీయ పోటీనే కాకుండా తన కుటుంబ రాజకీయ లెగసీని తిరిగి నిలబెట్టుకునే అగ్ని పరీక్షగా మారింది.