
న్యూఢిల్లీ: అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టడం.. ఆప్‌కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలను సభనుంచి 3 రోజులపాటు సస్పెండ్చేయడంతో ఢిల్లీలో పాలిటిక్స్వేడెక్కాయి. తమను అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టకుండా బీజేపీ సర్కారు అడ్డుకుంటున్నదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమ్ఆద్మీ పార్టీ మండిపడింది. ఇది ప్రజాస్వామ్య హత్య అని మాజీ సీఎం, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆతిశి మండిపడ్డారు. ఈమేరకు స్పీకర్విజేంద్ర గుప్తాకు శుక్రవారం ఓ లేఖ రాశారు.
ప్రతిపక్షానికి అన్యాయం చేశారని, ఇది ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర దెబ్బ అని లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పీకర్విజేందర్గుప్తా స్పందించారు. పార్లమెంటరీ రూల్స్ ప్రకారమే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. సభకు అంతరాయం కలిగించినందుకే వారిని సస్పెండ్ చేశామని తెలిపారు. కాగా, సీఎంవో కార్యాలయం నుంచి డాక్టర్బీఆర్అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్ర పటాలను తొలగించారని ఆరోపిస్తూ నిరసన తెలిపినందుకు ఆతిశితో సహా 22 మందిని మంగళవారం అసెంబ్లీ నుంచి స్పీకర్సస్పెండ్ చేశారు.
బాధతో లేఖ రాస్తున్నా: ఆతిశి
తాను ఎంతో బాధ, విచారంతో స్పీకర్‌కు లేఖ రాస్తున్నానని ఆతిశి అన్నారు. ‘‘న్యాయం, సమానత్వం అనేవి ప్రజాస్వామ్యానికి అతిపెద్ద బలాలు. కానీ.. గత కొద్దిరోజులుగా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అన్యాయం జరుగుతున్నది. అపొజిషన్గొంతు నొక్కుతున్నారు. అసెంబ్లీ లోపల, బయట ప్రజాగళాన్ని వినిపించకుండా అడ్డుకుంటున్నారు. ఇలా అయితే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది” అని లేఖలో స్పీకర్‌ను ప్రశ్నించారు.
మంగళవారం సభలో ‘మోదీ.. మోదీ’ అని నినదించిన అధికార పక్షంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కానీ.. ‘జై భీమ్’ నినాదాలు చేసినందుకు ప్రతిపక్ష నేతలపై సస్పెన్షన్వేటు వేశారని పేర్కొన్నారు. ఇక్కడితోనే అన్యాయం ఆగిపోలేదని.. ప్రజాస్వామ్యయుతంగా మహాత్మగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు.
ప్రతిపక్షం ఆరోపణలు అవాస్తవం: స్పీకర్
ప్రతిపక్ష నేత ఆతిశి రాసిన లేఖపై స్పీకర్ విజేందర్ గుప్తా స్పందించారు. ప్రతిపక్ష సభ్యులు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ఎల్జీ ప్రసంగాన్ని అడ్డుకుంటూ.. సభా కార్యకలాపాలకు అపొజిషన్ ఎమ్మెల్యేలు అంతరాయం కలిగించినందుకే వారిని సస్పెండ్చేశానని చెప్పారు. పార్లమెంటరీ నిబంధనల మేరకే ఆ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. అలాగే, అసెంబ్లీ రూల్ 277 ప్రకారం.. సస్పెన్షన్‌కు గురైన సభ్యుడు అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉండదని తెలిపారు.