ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్
  • ఒకటో తేదీ నుంచి 'మీ ఎమ్మెల్యే, మీ ఇంటి వద్దకు' పేరిట ప్రచారం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్​ఆద్మీ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ప్రజలకు చేరువయ్యేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 'మీ ఎమ్మెల్యే, మీ ఇంటి వద్దకు' (ఆప్ కా విధాయక్, ఆప్ కే ద్వార్) పేరిట ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇటీవల పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ సోమవారం మీడియాతో మట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రచారాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.

"మీటింగ్​లో ఢిల్లీలోని పాలన, రాజకీయ పరిస్థితులు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అంశాలపై వివరణాత్మక చర్చ జరిగింది. మనీశ్ సిసోడియా పాదయాత్రకు సానుకూల స్పందన లభిస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా జనాలు బయటకు వచ్చి 'మీకు చాలా అన్యాయం జరిగింది' అని చెప్తున్నారు. మేము ఈ పాదయాత్రను కొనసాగిస్తాం" అని ఆయన పేర్కొన్నారు. ఆప్ కా విధాయక్, ఆప్ కే ద్వార్ పేరిట ప్రారంభించనున్న ప్రచారంలో ఎమ్మెల్యేలు మండల, బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారని, ఇక్కడి రాజకీయ పరిస్థితులు, వారు చేసే పనిపై చర్చలు జరుగుతాయని తెలిపారు.

ఈ ప్రచారంలో ఢిల్లీ ప్రజలపై బీజేపీ పన్నుతున్న కుట్రను కూడా బట్టబయలు చేస్తామని, క్రమంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని పాఠక్ చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పొత్తుపై ఏమైనా చర్చ జరుగుతోందా అని మీడియా ప్రశ్నించగా.. ఆ విషయంలో ఎటువంటి చర్చ జరగలేదని పాఠక్​తెలిపారు.