విశ్లేషణ: పంజాబీలను​ మెప్పిస్తేనే.. దేశంలో

ఆమ్​ ఆద్మీ పార్టీకి ఇది పంజాబ్‌‌‌‌ ప్రజలిచ్చిన పరీక్షా కాలం! చిత్తశుద్ధితో పరీక్ష నెగ్గితే.. ఆప్​ దేశంలో వీచే కొత్త రాజకీయ గాలి అవుతుంది. ప్రజలు తీర్పు ఇచ్చినట్లుగానే ఆప్‌‌ పాలన పంజాబ్‌‌లో ఫలితాలు సాధిస్తే, హామీలు నెరవేరిస్తే... తప్పకుండా అదొక కొత్త రాజకీయ ఒరవడి అవుతుంది. ఇతర ప్రధాన పార్టీలకు అదే ఎజెండాగా మారుతుంది. ఎన్నికల ముందు ఎంతటి విషమ పరీక్షను ఆప్‌‌ ఎదుర్కొందో అంతకు మించిన అగ్ని పరీక్ష ఇప్పుడు భగవంత్‌‌ సింగ్‌‌ మాన్‌‌ నేతృత్వంలో కొత్తగా ఏర్పడ్డ పంజాబ్‌‌ ప్రభుత్వం ముందుంది. యావద్భారతావని ఇప్పుడు పంజాబ్‌‌ వైపు దృష్టి సారించింది.

పంజాబ్‌‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితం దేశ రాజకీయాల్లో సరికొత్త వాతావరణానికి తెర లేపింది. సుదీర్ఘ అనుభవం గల ప్రధాన రాజకీయ పార్టీలకు గుణపాఠాలు నేర్పడమే కాకుండా నూనూగు మీసాల నవయవ్వన పార్టీకి పెను సవాల్‌‌గా మారింది. ఎన్నికల జ్యోతిష్కుల సాధారణ అంచనాల్ని మించి ఆమ్‌‌ ఆద్మీ పార్టీ(ఆప్‌‌)కి పట్టం గట్టిన పంజాబీలు, దేశ భవిష్యత్తును శాసించే సరికొత్త రాజకీయ సంస్కృతికి వేగు చుక్కలవుతారా? ఈ తీర్పును గొప్ప అవకాశంగా తీసుకొని దేశంలో రాజకీయాలకు ఆప్‌‌ సరికొత్త నిర్వచనమిస్తుందా? లేక, ఇవేవీ జరక్కుండానే పుబ్బలో పుట్టి మఖలో పోయినట్లు తాత్కాలిక సందడిగానే ఓ రాజకీయ ప్రయోగం ఆల్పాయుష్షుతో ముగుస్తుందా? ఇవన్నీ భారతావని ముందున్న కోటి రూకల ప్రశ్నలు! పంజాబ్‌‌ పౌర సమాజం పెడుతున్న పరీక్షలో ఆప్‌‌ గెలుపోటముల్ని బట్టి దేశ భవిష్యత్‌‌ రాజకీయాలు ఆధారపడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల ఫలితం, ఆప్‌‌ అసాధారణ విజయం రాగల పరిణామాలకు కొత్త సంకేతాలిస్తున్నాయి. ఎన్నికల ముందు ఎంతటి విషమ పరీక్షను ఆప్‌‌ ఎదుర్కొందో అంతకు మించిన అగ్ని పరీక్ష ఇప్పుడు, భగవంత్‌‌ సింగ్‌‌ మాన్‌‌ నేతృత్వంలో కొత్తగా ఏర్పడ్డ పంజాబ్‌‌ ప్రభుత్వం ముందుంది. యావద్భారతావని ఇప్పుడిక నిశితంగా పంజాబ్‌‌ వైపు దృష్టి సారిస్తుంది. ఆప్‌‌ ఇప్పటికే పాలిస్తున్న దేశ రాజధాని నగరం, రాష్ట్రమైన ఢిల్లీ వేరు.. పూర్తి స్థాయి రాష్ట్రంగా ఉన్న పంజాబ్‌‌ వేరు. మరీ ముఖ్యంగా నేడు దిగజారిన రాజకీయ చౌకబారు విమర్శ–ప్రతి విమర్శ, తిట్టు–ఎదురు తిట్టు... వంటి వాటికి తలపడకుండా హుందాగా అక్కడ ప్రచార పర్వం సాగింది. అలా ప్రజాహృదయం దోచుకున్న ఆప్‌‌ అంతే మర్యాద పూర్వకంగా, తానిచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చి విశ్వసనీయత నిలబెట్టుకుంటుందా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

తీర్పు ప్రత్యేకత వల్లే..
బహుముఖ పోటీలో117 స్థానాలకు గానూ 92 చోట్ల ఆప్‌‌ను గెలిపించి దేశ ప్రజలను పంజాబ్‌‌ ఓటర్లు విస్మయపరిచారు. నెహ్రూ, ఇందిర వంటి బలమైన నాయకుల కాలంలో కూడా ఇంత ఏకపక్ష ఫలితాలు పంజాబ్‌‌లో ఎప్పుడూ లేవు. వేగంగా మారిన రాజకీయ పరిణామాలు, బహుముఖ పోటీల వల్ల ఫలితం మిశ్రమంగా ఉంటుందేమో? అన్న అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. సరిగ్గా పోలింగ్‌‌ సమీపిస్తున్న కొద్దీ దృశ్యం స్పష్టమైంది. అరడజనుకు పైగా పోల్‌‌ సర్వే సంస్థలు ఆప్‌‌కే విజయావకాశాలని చెప్పినా, ఇంతటి భారీ విజయాన్ని అవి కూడా ఊహించలేదు. నాకూ, ఆప్‌‌ అధినేత అరవింద్‌‌ కేజ్రివాల్‌‌కు సన్నిహితుడైన ఉమ్మడి మిత్రుడొకరి కథనం ప్రకారం.. పంజాబ్‌‌లో తమకు వచ్చే సీట్ల సంఖ్య 90 నుంచి100 మధ్య ఉంటుందని ఎగ్జిట్‌‌పోల్‌‌ ఫలితాల వెల్లడికి కొన్ని గంటల ముందే కేజ్రీవాల్‌‌ చెప్పారు. క్షేత్రంలో ముమ్మరంగా తిరిగి, పరిస్థితుల్ని వాస్తవికంగా అంచనా వేయడం వల్ల జనం నాడి ఆయనకలా ముందుగానే తెలిసి ఉంటుంది. ఆప్‌‌కు వచ్చింది 42.1 శాతం ఓట్లే అయినా 92 స్థానాలు దక్కాయి. కిందటి సారి 77 స్థానాలు గెలుచుకొని పరిపాలన చేసిన కాంగ్రెస్‌‌ పార్టీ ఈసారి 22.9 శాతం ఓట్లతో 18 స్థానాలతోనే సరిపెట్టుకుంది. 18.38 శాతం ఓట్లు తెచ్చుకున్నప్పటికీ, వందేండ్ల చరిత్ర కలిగిన శిరోమణి అకాలీదళ్‌‌ పార్టీకి దక్కింది3 స్థానాలే! కాకలు తీరిన రాజకీయ యోధుల్ని ఈసారి అనామకులైన ఆప్‌‌ అభ్యర్థులు ఓడించారు. అది కూడా భారీ ఓట్ల వ్యత్యాసంతో! ఇది అక్కడి సహజ ఓటింగ్‌‌ సరళికి భిన్నం. 2017 ఎన్నికల్లో 34 నియోజకవర్గాల్లో విజేతలు–పరాజితుల మధ్య ఓట్ల వ్యత్యాసం 2 శాతం లోపే!

శ్రమకు దక్కిన ఫలితం
పంజాబ్‌‌లో అధికారం ఆప్‌‌కు అంత తేలిగ్గా దక్కింది కాదు. దీని వెనుక ఎంతో శ్రమ, నిబద్ధత, ప్రయోగశీలత, విశ్వసనీయత వంటివి ఉన్నాయి. అధికార కాంగ్రెస్‌‌, రాష్ట్ర జనాభాలో మూడో వంతుగా ఉన్న ఎస్సీలకు ప్రాతినిధ్యం వహించే చరణ్‌‌జీత్‌‌ సింగ్‌‌ చన్నీని ఎన్నికలకు ముందు వ్యూహంతో ముఖ్యమంత్రిని చేసింది. సీఎం పదవి కోల్పోయి, అక్కడ భంగపడ్డ కెప్టెన్‌‌ అమరీందర్‌‌ సింగ్‌‌ను, అకాలీ చీలిక వర్గ నేతనూ కలుపుకొని భారతీయ జనతా పార్టీ బరిలో దిగింది. మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురావడాన్ని నిరసించి, బీజేపీతో విభేదించిన పాత నేస్తం శిరోమణి అకాలీదళ్‌‌ విడిగా పోటీ చేసింది. 2012 లో ఆవిర్భవించిన ఆప్‌‌ 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి 70లో 28 స్థానాలు గెలుచుకుంది. అతి పెద్ద పార్టీగా(31) అవతరించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాని పరిస్థితుల్లో, షరతులతో కూడిన కాంగ్రెస్‌‌ మద్దతు పొంది ఆప్‌‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 49 రోజుల్లోనే ఆ ప్రభుత్వం దిగిపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 434 చోట్ల ఆప్‌‌ పోటీ చేస్తే, 414 చోట్ల డిపాజిట్ దక్కలేదు! కానీ, ఆశ్చర్యకరంగా పంజాబ్‌‌లో 4 స్థానాలు దక్కించుకుంది. అది పునాది! ఆ నైతిక బలంతో వెంటనే, 2015 లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌‌ విజయదుందుబి(67/70) మోగించి, బీజేపీతో సహా అన్ని పక్షాలను ఊడ్చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పంజాబ్‌‌లో ఆప్‌‌కు ఒక్క సీటే దక్కింది. అంతకు రెండేండ్ల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై ఆప్‌‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. ముందు వాతావరణం ఎంతో సానుకూలంగా కనిపించినా, చివరి దశలో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్‌‌, ఎస్‌‌ఏడీ–బీజేపీ కూటమి చేసిన వ్యతిరేక ప్రచారంతో ఆప్‌‌ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. నక్సల్‌‌ ఉద్యమకారులు, ఖలిస్తాన్‌‌ వాదులు వారికి సహకరిస్తున్నారని, పంజాబ్‌‌ అస్థిత్వానికి ఆప్‌‌ వ్యతిరేకి అని, ఢిల్లీ అర్భన్‌‌ పాలనను పంజాబ్‌‌ పై రుద్దుతారనీ... రకరకాలుగా సాగిన ప్రచారంతో వారి గెలుపు 20 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయినా నిరుత్సాహ పడక, క్షేత్రాన్ని వదలకుండా ఆప్‌‌ సాగించిన కృషి ఈ సారి ఎన్నికల్లో  ఫలించింది. వారిపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది. భారీ మెజారిటీ సాధ్యపడింది.

పంజాబే ఇక ప్రయోగశాల!
ప్రజలు తీర్పు ఇచ్చినట్టే ఆప్‌‌ పాలన పంజాబ్‌‌లో ఫలితాలు సాధిస్తే, హామీలు నెరవేరిస్తే... తప్పకుండా అదొక కొత్త రాజకీయ ఒరవడి అవుతుంది. ఇతర ప్రధాన పార్టీలకు అదే ఎజెండాగా మారుతుంది. ప్రజల ఆకాంక్షలు తప్పక ఆ మేరకు పెరుగుతాయి. రాజకీయ పక్షాల వారందరూ, అదే పంథాలో సాగాల్సి వస్తుంది. పంజాబ్‌‌ ఎన్నికల్లో ఆప్‌‌ను విజయతీరాలకు మోసిన ‘హామీ’ల నావ మామూలుది కాదు. అవినీతి రహిత పంజాబ్‌‌, యువతకు ఉద్యోగాల కల్పన, రాష్ట్రం నుంచి డ్రగ్స్‌‌ మాఫియాను, మహమ్మారిని తరిమేయడం..  ఇవన్నీ సాధించడం అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ ఇవి చేయాలి. రైతుల రాబడి పెంచాలి. దళితులకు అభివృద్ధి ఫలాలను రుచి చూపుతూ వారికి సాధికారత దక్కేలా భరోసా ఇవ్వాలి. ఢిల్లీని నమూనాగా చూపినట్టు వైద్యారోగ్యం, విద్యా వ్యవస్థల్ని జనాలకు ఉపయోగపడేలా సంస్కరించాలి. స్థానిక నాయకత్వం స్వీయ నిర్ణయాలతో పనిచేస్తుందని, ఢిల్లీ పెత్తనాలతో సాగే కీలుబొమ్మ నాయకత్వం కాదని నిరూపించాలి. ఇప్పటికే పాదం పూనిన రాష్ట్రాల్లో ఆప్‌‌ బలపడాలంటే, ఇక్కడ పంజాబ్‌‌ పాలనలో ఫలితాలు చూపాలి. కేంద్రపాలిత హోదా గల రాష్ట్రంగా, దేశ రాజధానిగా ఢిల్లీ పరిస్థితి వేరు. రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌‌లో పొందుపరచిన అధికారాలు కలిగిన పూర్తిస్థాయి రాష్ట్రం పంజాబ్‌‌! ఏ కారణం చేతైనా ఫలితాలు సాధించలేనపుడు, ఢిల్లీలో చెప్పినట్టు ‘మేమెంత చేసినా.... కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోంది, ఫలితాలు సాధించలేకపోతున్నాం’ అనే వ్యాఖ్యలకు ఇక్కడ ఆస్కారం ఉండదు. అందుకే, ఆప్‌‌కు ఇది పంజాబ్‌‌ ప్రజలిచ్చిన పరీక్షా కాలం! చిత్తశుద్ధితో పరీక్ష నెగ్గితే.. దేశంలో వీచే రాజకీయ కొత్తగాలి ఆ పార్టీయే కావడం ఖాయం.

విస్తరణకు దారిదీపమా?
‘ఢిల్లీలో గెలిచినంత మాత్రాన ఇతర రాష్ట్రాల్లో ఆప్‌‌ గెలవడం కష్టం!’ అన్న జనాభిప్రాయాన్ని పంజాబ్‌‌ ఫలితం తారుమారు చేసింది. అలా అని ఈ ఫార్ములా యధాతథం దేశమంతటికీ విస్తరించవచ్చు అని చెప్పడం సాహసమే అవుతుంది. సంప్రదాయ రాజకీయ వ్యవస్థ వేళ్లూనిన మన దేశంలో ఆప్‌‌ వంటి కొత్త శైలి పార్టీలు ఎంత విస్తరించినా, వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు స్థాయిల్లో ఉంటాయి. కొన్ని చోట్ల కాయ దశ, మరికొన్ని చోట్ల దోరపండు స్థితి, ఇంకొన్ని చోట్ల పరిపక్వ పండు పరిస్థితి! పార్టీ వ్యూహం కూడా అలా దశలవారీగా విస్తరించాలనే ఉంది. పంజాబ్‌‌ విజయం ఆప్‌‌కు నైతిక స్థయిర్యాన్ని, కొత్త శక్తినీ ఇస్తుంది. ముఖ్యంగా హిందీ భాషా రాష్ట్రాల్లో విస్తరణ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఢిల్లీ, పంజాబ్‌‌ అనుభవ రీత్యా.. నిరుద్యోగితను ఎత్తిచూపుతూనే, అవినీతి రహిత, స్వచ్ఛ– పారదర్శక పాలన ఇస్తామనే ప్రచారంతో సాగితే హర్యానా, ఉత్తరాఖండ్‌‌, హిమాచల్‌‌ ప్రదేశ్‌‌ వంటి రాష్ట్రాల్లో పాగాకు ఆప్‌‌కు మెరుగైన అవకాశాలుంటాయి. ఆయా రాష్ట్రాల్లో లోతుగా వేళ్లూనుకున్న అవినీతి నిర్మూలనకు ఏ పార్టీ ఇప్పటిదాకా చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. అందుకే ఈ దిశలో ఫలితాలు రావట్లేదు. ప్రతిసారీ, ప్రభుత్వ వ్యతిరేకతే ప్రత్యర్థి పార్టీలను అధికారంలోకి తెస్తోంది. కాంగ్రెస్‌‌ బాగా బలహీనపడిన ప్రస్తుత పరిస్థితి వల్లే ఉత్తరాఖండ్‌‌లో ఈ సారి భిన్న ఫలితం, బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. గుజరాత్‌‌, మహారాష్ట్ర, బిహార్‌‌ వంటి రాష్ట్రాలపై కూడా ఆప్‌‌ కన్నేసింది. జార్ఖండ్‌‌, చత్తీస్‌‌గఢ్, రాజస్థాన్‌‌, మధ్యప్రదేశ్‌‌ వంటి రాష్ట్రాల్లో తమకు ఉండే విస్తరణావకాశాలపై అధ్యయనాలు చేస్తోంది. వారి విస్తరణకు పంజాబ్‌‌ అనుభవం ఏ మేర ఫలితమిస్తుందో చూడాలి. ఆ పైనే దక్షిణాది రాష్ట్రాలవైపు ఆప్‌‌ దృష్టి మళ్లించొచ్చు!
- దిలీప్‌‌ రెడ్డి డైరెక్టర్, పీపుల్స్‌‌ పల్స్‌‌