మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవంబర్‎లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  నిర్ణయం తీసుకుంది. పోటీకి దూరంగా ఉండనున్న ఆప్.. ఇండియా కూటమికి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఆప్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయడం లేదు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మహా వికాస్ అఘాడీ కూటమి తరుఫున ప్రచారం చేస్తారు’’ అని ఆప్ తెలిపింది. ఆప్‌ కేడర్ ఉన్న స్థానాలతో పాటు, ఎంవీఏ కూటమి అభ్యర్థులకు వివాదాస్పద నేపథ్యం లేని అసెంబ్లీ స్థానాల్లో కేజ్రీవాల్ క్యాంపెయినింగ్  చేస్తారని పేర్కొంది.

మహా వికాస్ అఘాడీ కూటమి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆప్ స్పష్టం చేసింది. కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీకి చెందిన మరి కొందరు సీనియర్ నేతలు సైతం ఇండియా కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ పోటీకి దూరంగా ఉండి.. ఇండియా కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలైన ఆప్, కాంగ్రెస్ ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం రెండు పార్టీలను భారీగా దెబ్బతీశాయి. 

హర్యానాలో తప్పక గెలుస్తుందనుకున్న కాంగ్రెస్ ఆప్ ఓట్ల చీలిక కారణంగా విజయం ముంగిట బోల్తా పడి మూడోసారి ప్రతిపక్షానికి పరిమితమయ్యింది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ఇరు పార్టీలు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఈ సారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. మొత్తం 288 నియోజకవర్గాలకు సింగిల్ ఫేజ్‎లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. 

మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్:

  • నోటిఫికేషన్ వెలువడు తేదీ: 22/10/ 2024
  • నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 29/10/ 2024
  • నామినేషన్ల పరిశీలన: 30/10/ 2024
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 04/11/ 2024
  • పోలింగ్ జరుగు తేదీ: 20/11/ 2024
  • కౌంటింగ్ తేదీ: 23/11/ 2024
  • మహారాష్ట్ర: 288 అసెంబ్లీ సీట్లు(జనరల్‌-234, ఎస్సీ-29, ఎస్టీ- 25)

మొత్తం ఓటర్ల సంఖ్య: 9 కోట్ల 63 లక్షలు

  • పురుష ఓటర్లు: 4 కోట్ల 97 లక్షలు
  • మహిళా ఓటర్లు: 4 కోట్ల 66 లక్షలు
  • యువత: 1.86 కోట్లు
  • తొలిసారి ఓటు హక్కు: 20.93లక్షలు
  • మొత్తం పోలింగ్ స్టేషన్లు: లక్షా 186 
  • ఒక్కో పోలింగ్ బూతుకు 960 మంది ఓటర్లు
  • మోడల్ పోలింగ్ స్టేషన్ 530