
మంచిర్యాల, వెలుగు: నస్పూర్ ఫ్లడ్ కాలనీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఎండీ నయీమ్ పాషా, శ్రీరాంపూర్‌కు చెందిన ఓ పత్రిక రిపోర్టర్ కె.రాజేందర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నస్పూర్‌లోని రాయల్ టాకీస్ చౌర స్తాలో హరిహర టీ స్టాల్ నడిపే రావిపాటి అన్వేశ్ ను బెదిరించి రూ.10 వేలు వసూలు చేయడంతో పాటు ఆర్టీఐ పేరుతో బ్లాక్ మెయిల్ చేయడం, పీఎఫ్ డబ్బులు ఇప్పిస్తామని వసూళ్లు చేయడం, భూ వివాదాల్లో జోక్యం చేసుకొని పలువురిని బెదిరించారనే ఫిర్యాదులపై వారిని అరెస్ట్ చేసి నట్టు మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్ మీడియాకు వెల్లడించారు. ఈ కేసుల్లో నిందితుడైన ఆప్ జిల్లా కన్వీనర్ నల్లా నాగేంద్ర ప్రసాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో నస్పూర్ సీఐ ఆకుల అశోక్, ఎస్సై సుగుణాకర్ పాల్గొన్నారు.