ఎన్నికల వేళ ఆప్‎కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు కౌన్సిలర్లు

ఎన్నికల వేళ ఆప్‎కు బిగ్ షాక్..  బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు కౌన్సిలర్లు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరో 15 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆప్ మాజీ ఎమ్మెల్యే, మరో ఇద్దరు కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఘోండా మాజీ ఎమ్మెల్యే శ్రీదత్ శర్మ, భజన్‌పురా మున్సిపల్ కౌన్సిలర్ రేఖా రాణి, ఖ్యాలా కౌన్సిలర్ శిల్పా కౌర్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పార్లమెంటరీ ప్రతినిధిగా ఉన్న చౌదరి విజేంద్ర కూడా చీపురు పార్టీకి వీడ్కోలు పలికారు. వీరంతా ఆప్ బద్ద శత్రువు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు.

బీజేపీ నేతలు హర్ష్ మల్హోత్రా, మనోజ్ తివారీ, కమల్జీత్ సెహ్రావత్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరో 15 రోజుల్లో ఎన్నికల జరగనున్న వేళ పార్టీ ఫిరాంయిపులు అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత వారం కూడా పెద్ద సంఖ్యలో ఆప్ నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో నలుగురు కీలక నేతలు పార్టీని వీడారు.

ALSO READ | 3 హామీలు నేరవేర్చలేకపోయా.. వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తా: కేజ్రీవాల్

దీంతో అప్రమత్తమైన ఆప్ అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో నిమగ్నమైంది. 2025, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8న కౌంటింగ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మంగా తీసుకోవడంతో దేశ రాజధానిలో ఈ సారి ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. 

హ్యా్ట్రిక్ విజయమే లక్ష్యంగా ఆప్ పావులు కదుపుతుండగా.. ఆమ్ ఆద్మీ అప్రతిహత విజయాలకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యుహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికల వేళ ఆ పార్టీ నేతలను చేర్చుకుని ఆప్ నాయకుల మనోస్థైర్యం మీద దెబ్బకొడుతోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఢిల్లీలో పునర్ వైభవం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆప్ కు ధీటుగా అభ్యర్థులను బరిలోకి దింపడంతో పాటు అగ్రనేతలు ప్రచారం హోరెత్తిస్తు్న్నారు. మరీ దేశ రాజధానిలో ఏ పార్టీ పాగా వేస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 8వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.