రెండు గంటల్లో మోడీ, అమిత్ షాను జైల్లో వేస్తా: సంజయ్ సింగ్

ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీలను తనకు అప్పగిస్తే కేవలం రెండు గంటల్లోనే మోడీ, అమిత్ షా, ఆదానీలను జైల్లో వేస్తానని చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ నియంత వలే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

ఢిల్లీలో ఉద్రిక్తత..

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో సీబీఐ అధికారులు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియా అరెస్ట్ ను నిరసిస్తూ ఆప్ ఎమ్మెల్యే సంజయ్ సింగ్ నేతృత్వంలో  ఆప్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సీబీఐ కార్యాలయం ముందు బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసులు సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు.


అధికార దుర్వినియోగం..

బీజేపీ ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని సంజయ్ సింగ్ ఆరోపించారు. ప్రతిపక్షాలపైనే దాడులు చేస్తున్న ఈడీ, సీబీఐ...బీజేపీ నేతలు, వారి కార్యాలయాలపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలను పునరుద్దరించినందుకు సిసోడియాను అరెస్ట్ చేశారా అని నిలదీశారు. ఇలాంటి చర్యలతో సీబీఐ, ఈడీలు  ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.