ఊపిరి పీల్చుకున్న ఆప్.. ఎట్టకేలకు జమ్మూ కాశ్మీర్‎లో బోణీ

ఊపిరి పీల్చుకున్న ఆప్.. ఎట్టకేలకు జమ్మూ కాశ్మీర్‎లో బోణీ

శ్రీనగర్: అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాలు హర్యానా, జమ్మూ కాశ్మీర్‎లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆదీ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. భారీ అంచనాలతో ఎన్నికల బరిలోకి దిగిన ఆప్‎కు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. హర్యానాలో  కాంగ్రెస్‎తో పొత్తు కాదని ఒంటరిగా పోటీ చేసిన ఆప్ పూర్తిగా చతికిలపడింది. కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో  విజయం సాధించలేకపోయింది. 

హర్యానాలో  ఏ మాత్రం ప్రభావం చూపించకుండా ఘోర ఓటమి మూటగట్టుకున్న ఆప్‎కు జమ్మూ కాశ్మీర్‎లో మాత్రం స్వల్ప ఊరట దక్కింది. ఎట్టకేలకు జమ్మూ కాశ్మీర్‎లో ఆప్ బోణీ కొట్టింది. దోడా అసెంబ్లీ సెగ్మెంట్‎లో విజయంతో ఆప్ ఖాతా తెరిచింది. ఆప్ అభ్యర్థి మేహరాజ్ మాలిక్ తన సమీప బీజేపీ అభ్యర్థి గజయ్ సింగ్ రాణాపై విజయం సాధించారు. 4,770  ఓట్ల తేడాతో  మేహరాజ్ మాలిక్ గెలుపొందటంతో ఆమ్ ఆద్మీపార్టీ ఊపిరి పీల్చుకుంది. 

ALSO READ | అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.. జమ్మూ కాశ్మీర్ సీఎం ఈయనే..!

ఇక, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఫస్ట్ టైమ్ జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ అబ్ధుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీని చిత్తు చేసి ఎన్సీ, కాంగ్రెస్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ కూటమి దూకుడుతో బీజేపీ సెకండ్ ప్లేస్‎కే  పరిమితం కాగా.. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ ఈ సారి చతికిలపడింది. ఒక్క స్థానంలో విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీ పరువు నిలుపుకుంది.