
- నెలలు గడుస్తున్నా 62 శాతమే
- వేగం పెంచడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ చర్యలు
- ఎమ్మార్సీల్లో ఆధార్ సెంటర్ల ఏర్పాటు
యాదాద్రి, వెలుగు : స్టూడెంట్స్ కు ఆపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అథెంటిక్రిజిస్ట్రీ) కార్డు అందించడానికి ఆటంకాలు ఎదురువుతున్నాయి. ఆధార్ కార్డుల్లోని వివరాలకు, స్టూడెంట్స్ చెబుతున్న సమాధానాలకు, స్కూల్స్ లో పేర్కొన్న వివరాలకు మ్యాచ్ కాకపోవడంతో ఆపార్ ప్రక్రియ స్పీడ్ అందుకోవడం లేదు. నాలుగు నెలలు కావస్తున్నా 60 శాతం మంది స్టూడెంట్స్ కు మాత్రమే అందించగలిగారు.
దేశంలో ప్రతిఒక్కరికీ ఆధార్ కార్డు అందించారు. అదే తరహాలో నేషనల్ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రతి స్టూడెంట్‌కు 12 అంకెలతో కూడిన ఆపార్ నంబర్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్డులు జారీ బాధ్యతలు స్కూల్స్ హెడ్మాస్టర్స్, కాలేజీ ప్రిన్సిపాల్స్ కు అప్పగించింది. స్టూడెంట్స్ కు ఆపార్ కార్డు ఇస్తే చదువు పూర్తయి.. జాబ్ సాధించే వరకు 12 అంకెలతో కూడిన నంబరు కార్డు ఉంటుంది.
ఈ కార్డులో స్టూడెంట్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందులో నమోదై ఉంటాయి. యూడైస్ వెబ్సైట్లో ప్రతి స్టూడెంట్‌కు పెన్ (పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్) ఉంది. దీని ఆధారంగానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం, టీసీలు జారీ చేయడం చేస్తారు. ఈ కార్డుల జారీ ప్రక్రియ ముగిసిందంటే.. ఆపార్లోనే అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తారు. పర్మినెంట్ డిజిటల్ నంబర్‌తో దేశంలో ఎక్కడ చదవాలన్న ఉపాధి ఆవకాశాలకు సంబంధించి ఈ కార్డు కీలకం కానుంది.
నెలలు కావస్తున్నా..
యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో ఇంటర్ వరకు చదువుతున్న స్టూడెంట్స్ 1,15,942 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. జిల్లాలో ఆపార్ కార్డు జారీ ప్రక్రియ ప్రారంభమై నాలుగు నెలలు కావస్తోంది. ఆటంకాల మధ్య ఇప్పటివరకు 72,120 స్టూడెంట్స్ (62 శాతం)కు మాత్రమే కార్డు అందించ గలిగారు. ముఖ్యంగా ఆధార్ కార్డుల్లో ఉన్న పేరుకు, స్కూల్ లో ఉన్న పేరుకు మ్యాచ్ కావడం లేదు. ప్రధానంగా చాలా మంది ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీతోపాటు పేర్లలోని అక్షరాల్లో తేడా ఉంది. బిగ్ లెటర్లు, స్మాల్ లెటర్లతోపాటు స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఆపార్ ప్రక్రియ ఆలస్యం జరుగుతోంది. వీటిని సవరించడానికి బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా కావాల్సి ఉంటుంది.
ఏండ్ల క్రితం జన్మించిన స్టూడెంట్స్ కు బర్త్ సర్టిఫికెట్ సాధించడం అంత ఈజీ కాదు. రోజుల తరబడి హాస్పిటల్స్, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీనికి తోడు ఇంటర్ స్టూడెంట్స్ కు సంబంధించిన ఆపార్ కార్డు జారీ మరీ ఆలస్యం అవుతోంది. కాలేజీల యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు స్టూడెంట్స్ నిర్లక్ష్యం కూడా తోడుగా నిలిచింది. దీంతో ఈ ఆపార్ కార్డు ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదు. నమోదు చేస్తున్న దృశ్యం
నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో..
నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం 2,48,326 మంది విద్యార్థులు ఉండగా, ఇప్పటివరకు 1,59,860 మంది మాత్రమే ఆపార్ లో నమోదు చేసుకున్నారు. అత్యధికంగా అడవిదేవులపల్లి మండలంలో 45.24 శాతం నమోదు కాగా, అత్యల్పంగా 21.63 శాతం నమోదైంది. మొత్తం ఇప్పటివరకు జిల్లాలో 35.62 శాతం మాత్రమే నమోదైంది. సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం 1,45,765 మంది విద్యార్థులు ఉండగా, 87,925 మంది ఆపార్ లో నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 60.31 శాతం నమోదైంది.
ఎమ్మార్సీలో ఆధార్ సెంటర్..
ఆపార్ కార్డు జారీ ప్రక్రియ వేగం పుంజుకోవడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి మండలంలోని ఎమ్మార్సీలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అది కూడా స్టూడెంట్స్ సంఖ్యకు అనుగుణంగా ఒక్కో మండలంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఏర్పాటు చేయనున్నారు. తక్కువ మంది ఉన్న మండలాల్లో రెండింటికి కలిపి ఒక సెంటర్, మున్సిపాలిటీల్లో రెండు సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ భావిస్తోంది.
ప్రభుత్వం అనుమతి పొందిన 'విరించి సొల్యూషన్స్ సంస్థ’ ఈ ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. అయితే ఆధార్ తప్పుల సవరణ, కొత్త కార్డు జారీకి నిర్ణయించిన రూ.100 ఫీజు స్టూడెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఆపార్ కార్డుల జారీ పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు.