ఆపార్ ఐడీకి ఆధార్ అడ్డంకులు..పేర్లు మ్యాచ్‌‌‌‌కాకపోవడంతో తిప్పలు

ఆపార్ ఐడీకి ఆధార్ అడ్డంకులు..పేర్లు మ్యాచ్‌‌‌‌కాకపోవడంతో తిప్పలు
  • ఆధార్‌‌‌‌‌‌‌కార్డు, స్కూల్‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌లో పేర్లు మ్యాచ్‌‌‌‌ కాకపోవడంతో తిప్పలు
  • రాష్ట్రంలో నత్తనడకన సాగుతున్న రిజిస్ట్రేషన్‌‌‌‌ ప్రక్రియ 
  • ప్రతి స్టూడెంట్‌‌‌‌కు డిజిటల్‌‌‌‌ ఐడీ క్రియేట్ చేస్తున్న కేంద్రం 
  • ఇప్పటివరకు 72 లక్షల మంది స్టూడెంట్లకు..11 లక్షల మందికే ఐడీలు 
  • ఇంకా 6,800 బడుల్లో మొదలు కాని ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు: ప్రతి స్టూడెంట్‌‌‌‌కు ప్రత్యేక ఐడీని కేటాయించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపార్ (ఆటోమేటిక్ పర్మినెంట్ అకాడమీ అకౌంట్ రిజిస్ట్రీ) విధానం రాష్ట్రంలో నత్తనడకన సాగుతోంది. ఈ ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇప్పటికీ 20 శాతం మందికి కూడా ఐడీలను కేటాయించలేదు. దీనికి ప్రధానంగా ‘ఆధార్’కార్డులే కారణమని తెలుస్తున్నది. 

ఆధార్‌‌‌‌‌‌‌‌లో, స్కూల్ రిజిస్ట్రర్‌‌‌‌‌‌‌‌లో పేర్లలో తేడాలు ఉండటంతో ఆపార్ నమోదు కావడం లేదు. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు 43,564 విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో 72,13,127 మంది విద్యార్థులు చదువుతున్నారు. 

విదేశాల్లో మాదిరిగా ప్రతి విద్యార్థికి ఒక ఐడీని క్రియేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థి వివరాలను డిజిటలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆపార్ ఐడీని తీసుకొచ్చింది. ఆపార్ ఐడీలో స్పెషల్ నంబర్‌‌‌‌‌‌‌‌తో పాటు జెండర్, పేరెంట్స్ వివరాలు, అడ్రస్ ఉంటాయి. ఒకసారి వివరాలు క్రియేట్ చేశాక వాటిని మార్చేందుకు అవకాశం లేదు. దీంతో ఈ వివరాలను ఆధార్‌‌‌‌‌‌‌‌తో లింక్‌‌‌‌ చేస్తుండటంతో అసలు సమస్య ఎదురవుతున్నది. స్కూల్‌‌‌‌లో ఒకపేరు, ఆధార్‌‌‌‌‌‌‌‌లో మరో పేరు ఉండటంతో ఐడీలు జనరేట్ కావడం లేదు. 

అధికారులు దీనిపై అవగాహన కల్పించకపోవడంతో పేరెంట్స్ కూడా ఆధార్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఈ ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా.. ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు కేవలం 16 శాతం మాత్రమే ఐడీలు క్రియేట్ చేశారు. ప్రస్తుతం కేంద్రం నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో రాష్ట్ర అధికారుల్లో చలనం మొదలైంది. 

చివరి స్థానంలో గద్వాల, వనపర్తి

ఆపార్ ఐడీ క్రియేట్ అంశాన్ని విద్యా శాఖ అధికారులు, విద్యాసంస్థలు సీరియస్‌‌‌‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. 42 వేలకు పైగా బడులుంటే 6,883 బడుల్లో ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. దీనికి తోడు 72 లక్షల మంది స్టూడెంట్లు ఉంటే.. 11.81 లక్షల మందికి మాత్రమే ఐడీలు జనరేట్ అయ్యాయి. ఇందులోనూ కొన్ని మార్పుల కోసం రెక్వెస్టులు వస్తున్నాయి. 

ఐడీల క్రియేట్‌‌‌‌లో వరంగల్ జిల్లా 41 శాతంతో టాప్‌‌‌‌లో ఉండగా, జోగులాంబ గద్వాల 5.36%, వనపర్తిలో 5.85% మందితో చివరి స్థానంలో నిలిచాయి. 33 జిల్లాల్లో 21 జిల్లాల్లో 20 శాతంలోపే ఆపార్ ఐడీలు పూర్తయ్యాయి. 

గద్వాల, వనపర్తి, మహమూబ్ నగర్, నారాయణపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో పది శాతంలోపే ఐడీలు ఉన్నాయి. మరోవైపు, ఆదిలాబాద్‌‌‌‌లో సగం స్కూళ్లలో ఈ ప్రక్రియ ఇంకా మొదలే పెట్టలేదు. మేడ్చల్‌‌‌‌లో 35 శాతం, నిజామాబాద్‌‌‌‌లో 34 శాతం, ఆసిఫాబాద్‌‌‌‌లో 32 శాతం స్కూళ్లలో కూడా ఈ ప్రక్రియ ఇంకా స్టార్ట్ కాలేదు.