- హాస్పిటల్లో రోగి చేరిన వెంటనే అప్రూవల్
- జనవరి నుంచి జీజీహెచ్‌లో 3,901 మందికి సర్జరీలు
- రూ.5 కోట్ల విలువ ఆపరేషన్లు
- బీఆర్ఎస్ గవర్నమెంట్హయాంలో బిల్స్ పెండింగ్
- ఇప్పుడు సీన్ మారడంతో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పెరిగిన హుషారు
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లలో వేగం పెరిగింది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో పేరుకుపోయిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేయడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్లు ఆరోగ్యశ్రీలో లిస్టెడ్ హాస్పిటల్‌గా చేరేందుకు పోటీ పడుతున్నాయి. ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీం పరిధిని విస్తరించడం ట్రీట్మెంట్ రేట్లను 11 ఏండ్ల తర్వాత పెంచడం కూడా దీనికి కారణంగా కనిపిస్తోంది.
జీజీహెచ్‌లో విపరీత రద్దీ
మెడికల్ కాలేజీకి అనుబంధంగా పనిచేసే జీజీహెచ్ హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు పెరిగాయి. జనవరి నుంచి జులై వరకు 3,901 ఆపరేషన్లు చేయగా రూ.5 కోట్ల వరకు బిల్లులను ప్రభుత్వం చెల్లించింది. ప్రతి రోజు దాదాపు 20కి పైగా శస్త్రచికిత్సలు ఆరోగ్య శ్రీ కింద చేస్తున్నారు. మోకీలు మార్పిడికి ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి కూడా రోగులు వస్తున్నారు. స్పైన్, న్యూరో, బ్రెయిన్ సర్జరీలు జరుగుతుండటంతో రోగులు కూడా ఎక్కువగా ఈ ఆసుపత్రికి వస్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ విధానం సరళీకృతం కావడంతో రోగుల్లో నమక్మం ఏర్పడింది. గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన 24 గంటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేలా చూస్తున్నారు. ప్రైవేట్ లిస్టెడ్ హాస్పిటల్స్‌లో జాయిన్ అయ్యే బాధితులకు ఒక రోజు గడువులో అప్రూవల్ శాంక్షన్ చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో పేదలకు ప్రయోజనం కలుగుతోంది. ఆరోగ్యశ్రీ స్కీం పరిధిని గవర్నమెంట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు ట్రీట్మెంట్ రేట్లను కూడా పెంచింది. కొత్తగా 163 చికిత్సలను స్కీంలో చేర్చి మొత్తం 1,835 రకాల ట్రీట్మెంట్లతో పరిధిని విస్తరించింది. కొత్తగా చేరిన దాంట్లో మోకీలు మార్పిడి కూడా ఉన్నందున జీజీహెచ్‌లో ప్రతినెలా 15 వరకు ఆపరేషన్లు జరుగుతున్నాయి.
బిల్స్‌పై నమ్మకం
గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ లో జరిగిన ఆపరేషన్లకు సకాలంలో బిల్స్ చెల్లించకపోవడంతో గవర్నమెంట్, ప్రైవేట్ లిస్టెడ్ హాస్పిటల్స్‌లో బకాయిలు పేరుకుపోయాయి. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక జీజీహెచ్ హాస్పిటల్ పాత బాకీ రూ.4 కోట్లు చెల్లించింది. జిల్లాలోని 14 ప్రైవేట్ హాస్పిటల్స్‌కు పాత బకాలయిన్నింటీని తీర్చేసింది. కొత్త బిల్లులు పెట్టిన వెంటనే శాంక్షన్ అవుతున్నాయి. దీంతో పేదలకు సకాలంలో వైద్యం అందుతోంది. పరిస్థితులు మారినందున గడిచిన నాలుగు నెలల్లో కొత్తగా నాలుగు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవల పర్మిషన్స్ పొందాయి.
ఉత్సాహంగా పనిచేయగలుతున్నం
రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్స్ పాతవన్నీ క్లియరయ్యాయి. గత ఏడాది రూ.4 కోట్ల బిల్లు ఆగిపోవడంతో స్కీం పరిధిలో పనిచేయడం కష్టమైంది. ఇప్పుడు లోపాలు సెట్ అయ్యాయి. అధిక సంఖ్యలో ఆపరేషన్లు చేయగలుతున్నం.
- డాక్టర్ ప్రతిమారాజ్, జీజీహెచ్ సూపరెండెంట్