- నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులతో మంత్రి దామోదర సమావేశం
- సమస్యల పరిష్కారానికి హామీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల పలు హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ సేవలను (నాన్ ఎమర్జెన్సీ) నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హాస్పిటల్స్ యాజమాన్యాలతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేశ్, జనరల్ సెక్రటరీ హరిప్రకాశ్, డాక్టర్ సౌజన్య, హరీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎంప్యానల్మెంట్ ఎంవోయూను సవరించాలని, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల రేట్లను రివైజ్ చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీ బకాయిలనూ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఆరోగ్యశ్రీకి గతంలో ఏడాదికి సగటున రూ.500 కోట్లు చెల్లిస్తే.. మా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రూ.1,137 కోట్లు చెల్లించాం. గతంలో ఉన్న బకాయిలను కూడా క్లియర్ చేశాం. రెగ్యులర్‌గా పేమెంట్స్ రిలీజ్ చేస్తున్నాం. మరో 6 నెలల్లో బకాయిలు లేకుండా పేమెంట్స్ క్లియర్ చేస్తాం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్యాకేజీ రేట్లను రివైజ్ చేశాం. రివిజన్‌కు సంబంధించి హాస్పిటళ్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేసి, సానుకూల నిర్ణయం తీసుకుంటాం. ఇతర సమస్యలను సైతం పరిష్కరించే బాధ్యత మాది”అని హామీ ఇచ్చారు. సమస్యలపై చర్చించేందుకు హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ సీఈవోతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మంత్రి హామీ మేరకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలు యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు.