T20 World Cup 2024: పాక్‌పై కాదు.. నేను చూసిన వాటిలో అదే కోహ్లీ బెస్ట్ ఇన్నింగ్స్: ఆరోన్ ఫించ్

T20 World Cup 2024: పాక్‌పై కాదు.. నేను చూసిన వాటిలో అదే కోహ్లీ బెస్ట్ ఇన్నింగ్స్: ఆరోన్ ఫించ్

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు. ఫార్మాట్ ఏదైనా కోహ్లీ క్రీజ్ లో కుదురుకుంటే బౌలర్, ప్రత్యర్థి, వేదికతో పని లేకుండా పరుగుల వరద పారిస్తాడు. కింగ్ కోహ్లీ ఎన్ని గొప్ప ఇన్నింగ్స్ లు ఆడినా.. కొన్ని మాత్రం ఆల్ టైం బెస్ట్ గా నిలుస్తాయి. టీ20 క్రికెట్ లో అతని బెస్ట్ ఇన్నింగ్స్ చెప్పుకోవాల్సి వస్తే 2022లో పాక్ పై అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. 160 పరుగుల లక్ష్య ఛేదనలో 30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయినా ఒంటరి పోరాటం చేసి చిరకాల ప్రత్యర్థి పాక్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. 

కోహ్లీ కెరీర్ లోనే కాదు..  టీ20 వరల్డ్ కప్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ గా వర్ణిస్తారు. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కోహ్లీ ఆడిన మరో గొప్ప ఇన్నింగ్స్ ను గుర్తు చేశాడు. 2016లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను సెమీస్ కు చేర్చాడు. ఈ మ్యాచ్ లో 51 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేసి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 

ఆసీస్ పై కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ కు ఫించ్ ఫిదా అయిపోయాడు. తాను చూసిన టీ20 బెస్ట్ ఇన్నింగ్స్ ఇదేనని కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. సెమీస్ కు వెళ్లాలంటే తప్పకుండా గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా కోహ్లీ చివరి వరకు క్రీజ్ లో ఉండి విజయాన్ని అందించాడు.