T20 World Cup 2024: అమెరికా బ్యాటర్ సంచలన ఇన్నింగ్స్.. తొలి రోజే ఆల్‌టైం రికార్డ్ బ్రేక్

T20 World Cup 2024: అమెరికా బ్యాటర్ సంచలన ఇన్నింగ్స్.. తొలి రోజే ఆల్‌టైం రికార్డ్ బ్రేక్

టీ20 వరల్డ్ కప్ ను ఆతిధ్య అమెరికా గ్రాండ్ గా ఆరంభించింది. డల్లాస్ వేదికగా కెనడాతో నేడు (జూన్ 2) జరిగిన మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి బోణీ కొట్టింది. మొదట బౌలింగ్ లో విఫలమైనా.. పవర్ ప్లే లో బ్యాటింగ్ లో తడబడ్డా అమెరికా విజయాన్ని కెనడా అడ్డుకోలేకపోయింది. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని  యూఎస్​ఏ 17.4 ఓవర్లలోనే ఛేజ్ చేసి ఔరా అనిపించింది. ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 94 నాటౌట్), ఆండ్రీస్ గౌస్ (46 బంతుల్లో 65) విధ్వంసంతో సునాయాస విజయాన్ని అందుకుంది.  

ఈ మ్యాచ్ లో హైలెట్ ఏదైనా ఉందంటే ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్ భారీ భాగస్వామ్యమే అని చెప్పుకోవాలి. మూడో వికెట్ కు 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. ముఖ్యంగా జోన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 40 బంతుల్లో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓడిపోతున్న జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లతో పాటు ఏకంగా 10 సిక్సులున్నాయి. ఈ ఇన్నింగ్స్ తో జోన్స్ టీ20 క్రికెట్ లో ఒక ఆల్ టైం రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఓపెనర్ కాకుండా సక్సెస్ ఫుల్ ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొదటి 8 బంతుల్లో 8 పరుగులే చేరిన జోన్స్ ఆ తర్వాత 32 బంతుల్లో 86 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్​ చేసిన   కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగుల భారీ స్కోరు చేసింది. నవ్​నీత్ ధలివాల్ (44 బంతుల్లో 61), నికోలర్ కిర్టన్ (31 బంతుల్లో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు.   సూపర్బ్ నాక్స్​తో అలరించారు.