
కౌడిపల్లి, వెలుగు: ఆసరా పెన్షన్లతో పాటు, ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిన రూ.6.50 లక్షలు చోరీ అయ్యాయి. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కౌడి పల్లి మండలం ముట్రాజ్‌పల్లి పోస్ట్‌ఆఫీస్‌లో రాథోడ్ సంజు బీపీఎంగా పనిచేస్తున్నాడు. పలువురు పెన్షన్‌దారులతో పాటు, ఉపాధి హామీ కూలీలకు సంబంధిం చిన రూ. 20 లక్షలను కౌడిపల్లి సబ్‌పోస్ట్‌మాస్టర్ ఈ నెల 25న రాథోడ్ సంజుకు అప్పగించారు.
ఇందులో నుంచి ముట్రాజ్‌పల్లి, రాజిపేట, వెంకటాపూర్ (ఆర్) గ్రామస్తులకు ఆసరా పెన్షన్లు, ఉపాధి హామీ కూలి పంపిణీ చేయగా తిమ్మాపూర్, కుషన్‌గడ్డ తండాకు సంబంధించిన రూ.8.11 లక్షలు మిగిలాయి. డబ్బులు ఉన్న బ్యాగ్‌తో పాటు, పెన్షన్‌కు సంబంధించిన మెషీన్‌తో రాథోడ్ సంజు ఈ నెల 28న నర్సాపూర్‌లో తాను ఉంటున్న రూమ్‌కు వచ్చాడు. బ్యాగ్‌ను లోపల పెట్టి తనతో పాటు రూంలో ఉంటున్న బేగరీ విశాల్, మెరుగు అజయ్‌తో కలిసి మరో గదిలో పడుకున్నారు.
29న ఉదయం 6 గంటలకు నిద్రలేచిన రాథోడ్ పెన్షన్లు ఇచ్చే మెషీన్‌కు ఛార్జింగ్ పెట్టేందుకు బ్యాగ్‌ను ఓపెన్ చేశాడు. అందులో ఉండాల్సిన రూ. 8.11 లక్షల్లో రూ.6.50 లక్షలు కనిపించలేదు. దీంతో వెంటనే పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చాడు. వారు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా బీపీఎం సంజు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.