గత కొన్ని రోజులుగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై వస్తున్న చర్చలకు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఒక్క మాటతో చెక్ పెట్టారు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి సరిగ్గా సరిపోతాడని ఏబీ చెప్పుకొచ్చారు.
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాక.. నాల్గవ స్థానం అన్నది భారత జట్టుకు అతి పెద్ద సమస్యగా మారింది. జట్టులోకి ఎందరో ఆటగాళ్లు వస్తున్నారు.. పోతున్నారు కానీ, ఆ స్థానంలో స్థిరంగా ఆడగల క్రికెటర్ ఎవరూ కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2023 ముంగిట దీని మీద మరోసారి చర్చ ఊపందుకుంది.
ఈ విషయంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన డివిలియర్స్.. భారత జట్టులో నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్ ఎవరనే దానిపై చర్చ జరుగుతోందని, ఆ స్థానంలో కోహ్లీ ఆడతాడనే పుకార్లు తాను విన్నట్లు చెప్పాడు. అందుకు తాను కూడా మద్దతిస్తున్నట్టు తెలిపాడు.
"కోహ్లీ నంబర్ 4 స్థానానికి సరిపోతాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతను ఇన్నింగ్స్‌ను సరిదిద్దగలడు. మిడిలార్డర్‌లో ఎలాంటి పాత్రనైనా పోషించగలడు.. రాణించగలడు. అయితే అందుకు అతను సిద్ధంగా ఉన్నాడో లేదో నాకు తెలియదు. నిజానికి కోహ్లీ నంబర్ 3లో ఆడడానికి ఇష్టపడతాడు. ఈ విషయం మనకూ తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉంటుంది. అందుకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.." అని ఏబీ చెప్పుకొచ్చారు.
AB de Villiers backs Virat Kohli to deliver at No.4 for India. pic.twitter.com/wldXy8ZU6v
— Cricbuzz (@cricbuzz) August 26, 2023
ఇక ఆసియాకప్ టోర్నీలో ఫేవరెట్ జట్టు ఏదన్న విషయంపై మాట్లాడిన డివిలియర్స్.. ఇండియా, పాకిస్థాన్ రెండింటిలో ఒక జట్టు విజేతగా నిలవచ్చని తెలిపాడు. అయితే శ్రీలంకతో జాగ్రత్తగా ఉండాలని.. ఏ మాత్రం అలసత్వం వహించినా గతేడాది ఫలితం పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదని డివిల్లియర్స్ తెలిపాడు.