
ఐపీఎల్ 2025 సీజన్ కు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెటర్లందరూ ఆడబోయే ఈ మెగా టోర్నీ మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ మే 25 న జరగబోయే ఫైనల్ తో ముగుస్తుంది. రెండు నెలలకు పైగా అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది. గత ఏడాది ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుండడంతో అన్ని జట్లు కొత్త ప్లేయర్లతో కళకళలాడుతున్నాయి. ఈ సారి ప్రతి జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తుంది.
మొత్తం 10 జట్లలో ఏ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్తుందో చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో మాజీ రాయల్ ఛాలెంజర్స్ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ 2025 లో ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లేవో అంచనా వేశాడు. డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయని తెలిపాడు.
Also Read : పాత రూల్‌ను మళ్ళీ తీసుకొచ్చిన బీసీసీఐ
"ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోగలదని నేను భావిస్తున్నాను. ఆర్సీబీ కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సారి జట్టు సమతుల్యతలో ఉంది. గుజరాత్ టైటాన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కూడా ప్లేఆఫ్ కు చేరే ఛాన్స్ ఉంటుంది". అని ఈ మాజీ సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్ అభిప్రాయపడ్డాడు.
డివిలియర్స్ లిస్ట్ లో ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు.. తీవ్ర చర్చకు దారి తీసింది. చెన్నై బలమైన జట్టని.. అయినప్పటికీ తన ఎంపికలకు కట్టుబడి ఉంటానని అన్నాడు. ఇక ఈ సీజన్ లో అత్యంత బలంగా కనిపిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరును కూడా డివిలియర్స్ చెప్పలేదు.
మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఐపీఎల్ 2025 టైటిల్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుచుకుంటుందని తన జోశ్యాన్ని తెలిపాడు. ఈసీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది.