గెలిస్తే తప్పుకుంటాడు: కోహ్లీ రిటైర్మెంట్ వార్తలపై డివిలియర్స్

గెలిస్తే తప్పుకుంటాడు: కోహ్లీ రిటైర్మెంట్ వార్తలపై డివిలియర్స్

భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం విదితమే. 34 ఏళ్ల వయసులోనూ సెంచరీల మీద సెంచరీలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇదే జోరును వరల్డ్ కప్ లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇలాంటి సమయాన అతనికి ఈ వరల్డ్ కప్ చివరిదన్న వార్తలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. 

ఐపీఎల్‌లో కోహ్లీ సహచరుడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆ వార్తలు నిజమే అన్నట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్తు గురించి కోహ్లీ ఎక్కువగా ఆలోచించడని తెలిపిన డివిలియర్స్.. ప్రస్తుతం అతని దృష్టంతా వన్డే ప్రపంచకప్‌పైనే ఉందని వెల్లడించారు. ఒకవేళ ఈ ఏడాది ప్రపంచకప్‌ విజేతగా నిలిస్తే.. కోహ్లీ వన్డే ఫార్మాట్‌ నుంచి తప్పకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

"2027 ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో ఆడటానికి కోహ్లీ ఇష్టపడతాడని తెలుసు. కానీ.. అలా 100 శాతం జరుగుతుందని చెప్పడం కష్టం. ఎందుకంటే దానికి చాలా సమయం ఉంది. అయితే.. ఈ ఏడాది భారత్‌ ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత విరాట్‌ ఇలా చెబుతాడన్నది నా ఆలోచన. 'ఇన్నాళ్లు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. నేను ఇకపై టెస్టు క్రికెట్‌, ఐపీఎల్‌ మాత్రమే ఆడతాను. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తాను. అందరికీ గుడ్‌బై.." అని చెప్పొచ్చని డివిలివియర్స్ అభిప్రాయపడ్డారు.  

50 ఓకే.. మరి 100 సెంచరీల సంగతి ఏంటి..?

సచిన్‌ వన్డే సెంచరీలు 49 కాగా, కోహ్లీ ఆ రికార్డుకు సమీపంలోనే ఉన్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 47 సెంచరీలు ఉన్నాయి. దీన్ని అధిగమించటానికి అతనికి పెద్ద సమయం పట్టదు. బుధవారం ఆసీస్‌తో మూడో వన్డేలోనో లేదంటే వరల్డ్ కప్‌ మొదటి రెండు మూడు మ్యాచుల్లో ఆ రికార్డును అధిగమించొచ్చు. కానీ వంద శతకాల రికార్డుకు మాత్రం అతను చాలా దూరంలో ఉన్నారు. దానికి ఇంకా 23 సెంచరీలు కావాలి. ఒకవేళ అతనికి అచ్చొచ్చిన వన్డే ఫార్మట్ నుంచి తప్పుకుంటే వంద శతకాల రికార్డును చేరుకోవటం కాస్త కష్టమే. కోహ్లీకి వ్యక్తిగత రికార్డులపై ఆశ ఉండదు కనుక తప్పుకోవడమన్నది ఖాయంగా కనిపిస్తోంది.