Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫైనల్‌కు వెళ్లే జట్లేవో చెప్పిన ఏబీ డివిలియర్స్

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫైనల్‌కు వెళ్లే జట్లేవో చెప్పిన ఏబీ డివిలియర్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్ లు ముగిశాయి. ఇక నాకౌట్ సమరం మాత్రమే మిగిలి ఉంది. మొత్తం రెండు సెమీ ఫైనల్.. ఒక ఫైనల్ తో పాటు మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగా దుబాయ్ వేదికగా మంగళవారం (మార్చి 4) జరగబోయే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ పైనే అందరి దృష్టి నెలకొంది. సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ మార్చి 5న న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతుంది. మార్చి 9న ఆదివారం రోజున ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతుంది. సెమీ ఫైనల్స్ కు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఫైనల్ కు వెళ్లే రెండు జట్లను అంచనా వేశాడు.  

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను ఒక అభిమాని 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనలిస్టులను అంచనా వేయమని అడిగాడు. సెమీ-ఫైనల్స్ లో అద్భుతమైన పోటీ ఉంటుందని చెప్పిన డివిలియర్స్..  ఇండియా, సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంటాయని జోస్యం చెప్పాడు. డివిలియర్స్ మాట్లాడుతూ.. " ఫైనల్ కు వెళ్లే జట్లను ఊహించడం కష్టం. ఇండియా, సౌతాఫ్రికా జట్లు ఫైనల్ కు చేరుకుంటాయని నేను అనుకుంటున్నాను. గత సంవత్సరం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లాగే ఈ సారి ఇండియా, సౌతాఫ్రికా ఫైనల్ కు చేరుకున్నా ఆశ్చర్యం లేదు". అని డివిలియర్స్ అన్నాడు.

ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో ప్రత్యర్థి జట్లను ఓడించి గ్రూప్ ‘ఏ’ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. గ్రూప్ ‘బీ’లో దక్షిణాఫ్రికా జట్టు 3 మ్యాచుల్లో 2 గెలిచి టాప్లో ఉంది. గ్రూప్ ‘ఏ’ లో టాప్లో ఉన్న జట్టు(టీమిండియా) గ్రూప్ ‘బీ’ లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో(ఆస్ట్రేలియా) సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ‘బీ’లో టాప్లో ఉన్న జట్టు(సౌతాఫ్రికా) గ్రూప్ ‘ఏ’లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో(న్యూజిలాండ్) సెమీస్లో తలపడుతుంది.