అమ్మా నాన్నా.. వస్తారా నాకోసం!.. కన్నవాళ్లకు దూరమైన ఎనిమిదేండ్ల కాజల్

అమ్మా నాన్నా.. వస్తారా నాకోసం!.. కన్నవాళ్లకు దూరమైన ఎనిమిదేండ్ల కాజల్
  • వృద్ధురాలితో రైల్వేస్టేషన్​లో తిరుగుతుండగా కాపాడిన చైల్డ్ లైన్ అధికారులు
  • ఏడాదిగా మంచిర్యాల చైల్డ్ హోమ్​లోనే ఆశ్రయం
  • తల్లిదండ్రుల జాడ కోసం అధికారుల అన్వేషణ

మంచిర్యాల, వెలుగు: అది జనవరి 15, 2024. మంచిర్యాల రైల్వేస్టేషన్​లో సుమారు 70 ఏండ్ల పెద్దావిడ మత్తులో తూలుతోంది. ఆమెతో ఏడేండ్ల పాప ఉంది. మాసిన జుట్టు, చిరిగిన బట్టలు, బక్కచిక్కిన శరీరం, బిత్తరచూపులు చూస్తోంది. పాపను ఆ స్థితిలో చూసినవారు చైల్డ్ లైన్ అధికారులకు ఫోన్ చేశారు. వారు వెంటనే వచ్చి పాపను చైల్డ్ హోమ్​కు తరలించి ఆశ్రయం కల్పించారు. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. సంవత్సరం పూర్తవుతున్నా బాలిక తల్లిదండ్రుల జాడ దొరకడం లేదు. పాపను కన్నవాళ్ల ఒడికి చేర్చాలని ఏడాదిగా అధికారులు అన్వేషిస్తూనే ఉన్నారు.  

ఏ తల్లి కన్నబిడ్డో.. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు రైల్వేస్టేషన్లలో భిక్షాటన చేస్తూ వచ్చిన పైసలతో మద్యం తాగుతూ ఎక్కడెక్కడో తిరిగేది. తమది మహారాష్ట్రలోని వార్దా అని.. పాప పేరు కాజల్, తన మనుమరాలు అని చెప్పింది. అంతకుమించిన వివరాలేవీ చెప్పకపోవడంతో అనుమానించిన చైల్డ్ లైన్ అధికారులు ఆ బాలికను తమ కస్టడీలోకి తీసుకొని మంచిర్యాలలోని చైల్డ్ హోమ్​కు తరలించారు. వృద్ధురాలు రెండు మూడు రోజులకోసారి మద్యం తాగి వచ్చి పాపను తనతో పంపాలని లొల్లి చేసేది.

 కానీ అధికారులు పాప తల్లిదండ్రులను తోలుకొని రావాలని చెప్పి పంపేవారు. కొద్దిరోజుల తర్వాత ఆ పెద్దావిడ జాడ కూడా లేదు. ఆమె చెప్పిన ప్రకారం అధికారులు వార్దా పోలీసులకు, చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వృద్ధురాలు చెప్పిన వివరాల ప్రకారం అక్కడ ఎవరూ లేరు. ఇంతవరకు తగిన ఆధారాలతో కాజల్ తమ కూతురే అంటూ ఎవరూ రాలేదు. ఆ వృద్ధురాలు ఏమైంది? కాజల్ తన మనుమరాలేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఆమెతో ఉంది? తల్లిదండ్రులు ఎక్కడున్నారు? బిడ్డ కోసం వెతుకుతున్నారా? వదిలేశారా? అనేక ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. 

చలాకీగా మారి చదువుకుంటున్న కాజల్

రైల్వేస్టేషన్​లో దయనీయ స్థితిలో కనిపించిన కాజల్ బాలసదనంలో చురుకుగా, చలాకీగా మారింది. అప్పుడు తెలుగు, హిందీ భాషలు అస్పష్టంగా మాట్లాడిన పాప ఇప్పుడు తెలుగు బాగా నేర్చుకుంది. బాలసదనంలోని తోటి పిల్లలతో కలిసి స్కూల్​కు వెళ్తోంది. ప్రస్తుతం మంచిర్యాల కాలేజ్ రోడ్​లోని గర్మిళ్ల గవర్నమెంట్ స్కూల్​లో థర్డ్ క్లాస్ చదువుతోంది. ఇప్పటికీ తన పేరు కాజల్ అని మాత్రమే చెబుతోంది. ఇప్పుడు కాజల్​కు బాలసదనమే ఇల్లు. సిబ్బందే అమ్మాన్నాన్నలు. తోటి పిల్లలే తోబుట్టువులు. 

తగిన ఆధారాలతో సంప్రదించండి

కాజల్​ను తల్లిదండ్రులకు అప్పగించాలని ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నాం. వృద్ధురాలు చెప్పిన వివరాల ప్రకారం వార్దా పోలీసులకు, అక్కడికి అధికారులకు సమాచారం అందించాం. అలాంటివారు ఎవరూ లేరని తెలిపారు. ఇంతవరకు పాప తల్లిదండ్రుల ఆచూకీ దొరకలేదు. అమ్మాయి సంబంధీకులు ఉన్నట్లయితే తగిన ఆధారాలతో కలెక్టరేట్​లోని సంక్షేమ శాఖ ఆఫీసులో లేదా మంచిర్యాలలోని బాలరక్ష భవన్​లో సంప్రదించాలి. లేదా 8886592786, 9441506519, 9908541697 నంబర్లకు కాల్ చేయండి. - రౌఫ్​ఖాన్ (డీడబ్ల్యూవో), ఆనంద్ (డీసీపీవో)