అవయవదానం చేస్తామని ఊరు ఊరంతా ముందుకొచ్చారు

దానాల్లోకెల్లా గొప్పదానం అవయవదానం అని చెప్తుంటారు. చనిపోయిన తర్వాత కూడా మరొక జీవితాన్ని నిలబెట్టే దానం అది. అయితే అవయవదానం చేయడానికి అందరికీ ధైర్యం సరిపోదు. అలాంటిది ఒక ఊరుఊరంతా ఆర్గాన్స్ డొనేట్ చేస్తామని ముందుకొచ్చారు.  ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న ఆ ఊరిపేరు అబ్బిడిపల్లి.


పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఉన్న అబ్బిడిపల్లిలో542 మంది ఉంటారు. ఊరు చిన్నదే అయినా ఊరివాళ్ల ఆలోచన మాత్రం పెద్దది. ఊళ్లో ఉన్న 421 మంది ఓటర్లంతా కలిసి ‘చనిపోయిన తర్వాత అవయవ దానం చేస్తామ’ని గ్రామపంచాయితీలో తీర్మానం చేశారు. అవయవదానం చేయడం ద్వారా మనిషి భౌతికంగా లేకపోయినా అతని అవయవాలు బతికే ఉంటాయని, అలా ఒక వ్యక్తి ఎంతోమందిలో బతికే ఉంటాడని అక్కడి వాళ్లు చెప్తున్నారు. సదాశయ  ఫౌండేషన్ ద్వారా వాళ్లకి ఆ ఆలోచన వచ్చిందంటున్నారు.

ఫౌండేషన్ సాయంతో..

ఆర్గాన్ డొనేషన్‌‌‌‌పై ఈ మధ్యకాలంలో అవేర్‌‌‌‌నెస్ పెరుగుతోంది. చాలామంది తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. అలాగే అవయవదానంపై కొంతమందిలో అపోహలు కూడా ఉన్నాయి. అవయవాలను దానం చేయకూడదని కొంతమంది నమ్ముతుంటారు. ఇలాంటి  అనుమానాలను పోగొడుతూ కొన్ని ఫౌండేషన్లు జనాల్లో అవేర్‌‌‌‌నెస్ కల్పిస్తున్నాయి.

అలా సదాశయ ఫౌండేషన్ కల్పించిన అవేర్‌‌‌‌నెస్‌‌తోనే అబ్బిడిపల్లి ఊరివాళ్లంతా ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. శరీరానికి చావు ఉన్నా అవయవాలకు లేదని ఊరి వాళ్లంతా బలంగా నమ్మేలా సదాశయ ఫౌండేషన్ వాళ్లు ప్రచారం చేశారు. చనిపోయిన తర్వాత కళ్లు, ఇతర శరీరభాగాలు మట్టిపాలు కాకుండా ఇతరులకు ఉపయోగపడేలా చేయొచ్చని అర్థమయ్యేలా వివరించారు. అలాగే వయసుతో పని లేకుండా చనిపోయిన తర్వాత కళ్లు, ఇతర అవయవాలను దానం చేయొచ్చని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇవన్నీ అర్థం చేసుకున్న అబ్బిడిపల్లి గ్రామస్తులు అవయవాలే కాకుండా శరీరం మొత్తాన్ని దానం చేస్తామని  గ్రామపంచాయితీలో తీర్మానం చేసి, ఆ కాపీని జిల్లా కలెక్టర్‌‌‌‌కు ఇచ్చారు. 

పక్క ఊరిని చూసి..

అబ్బిడిపల్లి ఊరివాళ్లకు పక్కనే ఉన్న ఓదెల గ్రామం ఆదర్శం. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో ఓదెల ఊళ్లో110 మంది నేత్రదానం చేశారు. యువత నుంచి వృద్ధుల వరకు 110 మంది నేత్రదానం చేసి, 220 మంది అంధులకు చూపునిచ్చారు. ఆ ఇన్‌‌స్పిరేషన్‌‌తో ఇప్పుడు అబ్బిడిపల్లి గ్రామస్తులు కూడా మూకుమ్మడిగా అవయవదానం చేయడానికి రెడీ అయ్యారు.

ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్లో ఎవరు చనిపోయినా బంధువులకు సమాచారం ఇచ్చినట్లుగానే సదాశయ ఫౌండేషన్‌‌ వాళ్లకు కూడా వార్త చెప్తుంటారు. సొంతవాళ్లు మరణించారన్న దుఃఖంలో ఉన్నప్పటికీ అదొక బాధ్యతలాగా భావించి ఫ్యామిలీ మెంబర్స్‌‌.. అవయవ దానానికి ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఆర్గాన్స్ డొనేట్ చేసిన వారికి నివాళిగా ఊళ్లో హోర్డింగ్‌‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. దాంతో ప్రజల్లో అవగాహన మరింత పెరుగుతోంది.


అవయవదానం తో పునర్జన్మ

అవయవదానం చేస్తే చనిపోయిన తర్వాత ఆ అవయవాలు మరికొంతమంది శరీరాలకు ఉపయోగపడతాయి. దీంతో చనిపోయినా కూడా తిరిగి బతికినట్లే. మా గ్రామంలో ప్రజలందరికీ అవయవదానంపై సదాశయ ఫౌండేషన్ సాయంతో అవగాహన కల్పించాం. అందరూ అర్థం చేసుకొని అవయవదానానికి ముందుకొచ్చారు. అవయవదానంపై పంచాయితీలో తీర్మానం చేశాం. మా ఊరు ఎప్పటికీ దీన్ని పాటిస్తుందని నమ్ముతున్నా.  – ఒజ్జ కోమలత, సర్పంచ్, అబ్బిడిపల్లి

అనుమానాలు పోగొట్టాం

అవయవదానంపై చాలా అనుమానాలున్నాయి. అవయవదానం సంప్రదాయానికి వ్యతిరేకమని చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్లకి అవయవ దానం గొప్పదనాన్ని అర్థమయ్యేలా చెప్తున్నాం. చాలామంది అబ్బిడిపల్లి గ్రామస్తులు అవయవాలతో పాటు శరీర దానం కూడా చేయడానికి ముందుకొచ్చారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని గ్రామాల్లో అవయవదానంపై కార్యక్రమాలు చేస్తాం.    - మేర్గు భీష్మాచారి, సదాశయ ఫౌండేషన్

ఇతరులకు ఉపయోగపడాలని..

చనిపోయిన తర్వాత ఎందుకూ ఉపయోగపడని శరీరం, అవయవాలు ఇతరులకు ఉపయోగపడితే మంచిదే కదా. అందుకే అవయవదానానికి అంగీకరించాను. మా మండలంలో ఇప్పటికే వందల మంది నేత్రదానం చేశాం. వాళ్లను ఆదర్శంగా తీసుకుని మేము కూడా మూకుమ్మడిగా అవయవదానానికి ప్రతిజ్ఞ చేశాం. ప్రజలందరూ అవయవదానం చేస్తే  ప్రమాదవశాత్తు చనిపోతున్న చాలామందిని కాపాడొచ్చు.  - మాలవేన చందు