నవీన్ హత్య కేసులో పోలీస్ కస్టడీకి  హరిహర కృష్ణ

హైదరాబాద్ : ఇంజనీరింగ్ స్టూడెంట్ నవీన్ మర్డర్ కేసులో నిందితుడు హరిహర కృష్ణను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. హరిహర కృష్ణని వారం రోజుల పాటు పోలీసుల కస్టడీకి రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ  అట్రాసిటీ స్పెషల్​ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చర్లపల్లి జైలులో ఉన్న హరిహర కృష్ణను అబ్దుల్లాపూర్​మెట్​ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

మార్చి 3 నుంచి 9వ తేదీ వరకు హరిహర కృష్ణని పోలీసులు విచారించనున్నారు. నిందితుడికి ఇంకా ఎవరైనా సహకరించారా...? లేదా ఒక్కడే హత్య చేశాడా..? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. మరోవైపు.. హరిహర కృష్ణ, నవీన్ తో పరిచయం ఉన్న  యువతి పాత్రపైనా పోలీసులు ఆరా తీయనున్నారు. నవీన్ డెడ్ బాడీ పార్ట్స్ ఎక్కడెక్కడ పడేశాడో వంటి వివరాలను కూడా సేకరించనున్నారు. 

హత్య జరిగిన తీరుపై సీన్ రీ కన్ స్ట్రక్షన్​ చేయనున్నారు. మూసారాం బాగ్ నుంచి పెద్ద అంబర్​పేట్​ వైన్స్ వరకు.. అక్కడి నుంచి అబ్దుల్లాపూర్ మెట్​లోని మర్డర్ చేసిన ప్రాంతం వరకు.. మళ్లీ  అక్కడి  నుంచి  బ్రాహ్మణపల్లి వరకు.. బ్రాహ్మణపల్లి నుంచి హాసన్ ఇంటికి,  ఆ తర్వాత మళ్లీ మర్డర్ జరిగిన ప్రాంతంలో హరితో పోలీసులు సీన్ రీ కన్​స్ట్రక్షన్​ చేయించనున్నారు.  అతడు ఇచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని ఆధారాలను సేకరించనున్నారు.