- ముందుగా ఆటోలు, తర్వాత ఇతర వెహికల్స్‌లో ఏర్పాటు
- క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లైవ్‌లొకేషన్ వివరాలు ప్రత్యక్షం
- సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణ కల్పించనున్న పోలీసులు
మంచిర్యాల, వెలుగు: ఆటోలు, ట్యాక్సీల్లో ప్రయాణించే మహిళలతో పాటు ప్రయాణికుల భద్రత కోసం రామగుండం పోలీస్ కమిషరేట్పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం గతంలో రూపొందించిన అభయ్(సేఫ్ఆటో) మొబైల్ యాప్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఇటీవలే రామగుండంలోని కమిషనరేట్‌లో ఈ యాప్‌ను ప్రారంభించారు. ముందుగా ఆటోలు, తర్వాత కార్లు, ఇతర ప్రైవేట్వెహికల్స్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాప్‌లో ఆటోలు, డ్రైవర్లకు సంబంధించిన పూర్తి వివరాలను నిక్షిప్తం చేస్తారు. ఈ యాప్ పోలీస్కమాండ్కంట్రోల్ సెంటర్‌తో పాటు పోలీస్ స్టేషన్లకు లింక్‌చేసి ఉంటుంది. దీంతో మహిళలపై జరిగే అఘాయిత్యాలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని పేర్కొంటున్నారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు
అభయ్(సేఫ్ఆటో) యాప్ క్యూఆర్ కోడ్ విధానంలో పనిచేస్తుంది. యూనిక్ నంబర్‌తో కూడిన క్యూఆర్‌కోడ్ ను డ్రైవర్ సీటు వెనుక ప్రయాణికులకు కనిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. కమిషనరేట్పరిధిలో 5వేలకు పైగా ఆటోలు ఉండగా, ఇప్పటికే 4500లకు పైగా ఆటోల్లో ఈ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. మహిళలు, ప్రయాణికులతో ఆటో డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించినా, దురుద్దేశంతో ఆటోను దారిమళ్లించినా, స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చేసినా లేదా తాము మరేదైనా ప్రమాదంలో ఉన్నట్లు భావించినా ఈ యాప్‌ద్వారా పోలీసుల తక్షణ సహాయం పొందవచ్చు. అందుకే స్మార్ట్‌ఫోన్‌లో ఈ అభయ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఎమర్జెన్సీ టైమ్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సదరు కంప్లైంట్కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుంది. ఆపై సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం వెళ్లి, వెంటనే ఆటో లైవ్ లొకేషన్ తెలిసిపోతుంది. ఈ యాప్‌లో ఎమర్జెన్సీ కాల్స్, ఎస్ఎంఎస్, లొకేషన్ట్రేసింగ్, ఎమర్జెన్సీ కంప్లైంట్స్వంటి ఆప్షన్స్ఉన్నాయి.
మహిళలకు పూర్తి భద్రత
మహిళలు, ఉద్యోగులు, విద్యార్థినులు నిత్యం ఆటోల్లోనే ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. మహిళా ఉద్యోగులైతే పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి వేళల్లో కూడా ఒంటరిగా ఆటోల్లో ట్రావెల్ చేయాల్సిన పరిస్థితులుంటాయి. ఇదే అదునుగా ఈ మధ్య కాలంలో మహిళలపై ఆటో డ్రైవర్ల ఆగడాలు పెరుగుతున్నాయి. ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు వారి అసహాయతను ఆసరాగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నారు. ఇవే కాక మద్యం మత్తులో స్పీడ్‌గా, ర్యాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌చేస్తే లైవ్ లొకేషన్ వివరాలు కమాండ్ కంట్రోల్‌సెంటర్‌కు చేరుతాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలు, ప్రయాణికులను రక్షించడంతో పాటు ఆకతాయిల ఆటకట్టించేందుకు అవకాశం ఉంటుంది.
ప్రతి ఒక్కరు ఇన్స్టాల్చేసుకోవాలి
ఆటోల్లో వెళ్లే ప్రయాణికుల భద్రత కోసం అభయ్(సేఫ్ ఆటో) యాప్ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఈ యాప్ రక్షణ కల్పిస్తుంది. ప్రమాదాన్ని పసిగట్టి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని రక్షణ కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను
ఇన్స్టాల్ చేసుకోవాలి.
రెమా రాజేశ్వరి, పోలీస్ కమిషనర్