ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి రెండు టెస్ట్‌ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. వ్యక్తిగత కారణాలతో అతను తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడని.. ఈ మేరకు బీసీసీఐ కూడా ఈ విషయాన్ని తెలియజేశాడని బోర్డు వర్గాలు తెలిపాయి. నవంబర్ 22 నుంచి పెర్త్‌లో తొలి టెస్ట్, డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో రెండో మ్యాచ్ జరగనుంది.
Also Read : భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ దూరం
ప్రస్తుతం రోహిత్ శర్మ భార్య రితీక గర్భవతి. ఆమె నవంబర్‌లో డెలివరీ అయ్యే అవకాశం ఉంది. డెలివరీ సమయంలో భార్య పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న రోహిత్.. ఆసీస్ సిరీస్‌లోని రెండు మ్యాచులకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే అతడి స్థానంలో ఎవరు ఎంపికవుతారనే దానిపై ఆసక్తి మొదలైంది. ఈ లిస్టులో టాప్ గా వినిపిస్తున్న పేరు అభిమన్యు ఈశ్వరన్. నిన్నటివరకు గైక్వాడ్ సెలక్ట్ అవుతాడనుకున్నా.. ఒక్కసారిగా ఈశ్వరన్ రేస్ లో కి వచ్చాడు.
నివేదికల ప్రకారం, ఈశ్వరన్ బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇరానీ ట్రోఫీలో అభిమన్యు 191 పరుగుల భారీ స్కోర్ చేసి తృటిలో డబుల్ సెంచరీ కోల్పోయాడు. అంతకముందు దులీప్ ట్రోఫీలోనూ అద్భుతంగా రాణించాడు. దీనికి తోడు ఆస్ట్రేలియాలో జరగబోయే భారత ఏ జట్టుకు అతడు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనూ ఈ 29 ఏళ్ళ బ్యాటర్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే గైక్వాడ్ కంటే ఈశ్వరన్ ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటివరకు 161 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ లు ఆడిన అభిమన్యు ఈశ్వరన్ 49 యావరేజ్ తో 7404 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు.. 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.లీగ్ ఏదైనా అభిమన్యు తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. 2015 నుంచి టెస్ట్ క్రికెట్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. అయితే టీమిండియా ఎంట్రీ మాత్రం అతనికి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా భారత జట్టు తరపున ఆడలేకపోతున్నాడు. అయితే ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ 29 ఏళ్ళ ఆటగాడికి చోటు దక్కే అవకాశాలున్నాయి.