- 7 వికెట్లతో యూఏఈపై గ్రాండ్ విక్టరీ
- రాణించిన అభిషేక్, రసిఖ్
అల్ అమెరత్ : ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో ఇండియా కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. మెగా టోర్నీలో వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్నారు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ పని పట్టిన ఇండియా–ఎ అదే జోరుతో యూఏఈని చిత్తు చేసింది. బౌలింగ్‌లో రసిఖ్ సలామ్ (3/15), బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (24 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 58) సత్తా చాటడంతో సోమవారం జరిగిన గ్రూప్–బి రెండో మ్యాచ్‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ 16.5 ఓవర్లలో 107 రన్స్‌కే ఆలౌటైంది. రాహుల్ చోప్రా (50) ఫిఫ్టీతో మెరవగా కెప్టెన్ బాసిల్ హమీద్ (22) ఫర్వాలేదనిపించాడు. రసిఖ్‌తో పాటు రమణ్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టడంతో మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇండియా బౌలర్ల దెబ్బకు యూఏఈ జట్టులో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఛేజింగ్‌లో ఇండియా 10.5 ఓవర్లలోనే 111/3 స్కోరు చేసి గెలిచింది.
తొలి ఓవర్లోనే ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (8) ఔటైనా కెప్టెన్ తిలక్ వర్మ (21)తో కలిసి అభిషేక్ రెండో వికెట్‌కు 73 రన్స్ జోడించాడు. ఆయుష్ బదోనీ (12 నాటౌట్) 6, 4తో మ్యాచ్‌ను ముగించాడు. రసిఖ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇండియా 4 పాయింట్లతో గ్రూప్–బిలో టాప్ ప్లేస్‌లో ఉంది. బుధవారం జరిగే చివరి లీగ్ పోరులో ఒమన్‌తో పోటీ పడనుంది.