Abhishek Sharma: అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్

Abhishek Sharma: అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్

జింబాబ్వేతో జరుగుతోన్న ఐదు టీ20 సిరీస్‌ను భారత యువ జట్టు.. మరో మ్యాచ్ మిగిలివుండగానే చేజిక్కించుకుంది. శనివారం(జులై 13) జరిగిన నాలుగో టీ20లో గిల్ సేన.. ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చిత్తుగా ఓడించింది. తొలుత జింబాబ్వే 152 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని భారత ఓపెనింగ్ ద్వయం శుభ్‌మన్ గిల్ (58*), యశస్వి జైస్వాల్ (93*) ఆడుతూ పాడుతూ చేధించారు. 15.2 ఓవర్లలోనే ఛేదించి.. భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సిరీస్‌తో భారత జట్టు తరుపున అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అభిషేక్ శ‌ర్మ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మైన‌ప్పట‌కి ఆ త‌ర్వాత మ్యాచ్‌లోనే విధ్వంస‌క‌ర సెంచ‌రీతో మెరిశాడు. 47 బంతుల్లోనే వంద మార్క్ చేరుకొని ఔరా అనిపించాడు. అనంతరం మూడో టీ20లో 10 ప‌రుగులకు ఔటవ్వగా.. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవ‌కాశమే రాలేదు. అయితే, బ్యాటింగ్‌ చేసే ఛాన్స్ రాన‌ప్పట‌కీ.. బౌలింగ్‌లో త‌న మార్క్ చూపించాడు. 3 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి కేవ‌లం 20 ప‌రుగులిచ్చాడు. అంతేకాదు, ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. తద్వారా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

ఓ టీ20 సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా అభిషేక్‌ చరిత్రల్లోకెక్కాడు. ఇప్పటివ‌ర‌కూ అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో ఏ భార‌త క్రికెట‌ర్ ఈ ఘ‌న‌త సాధించ‌లేదు. అయితే, టెస్టుల్లో లాలా అమర్‌నాథ్ (1933), వన్డేల్లో కపిల్ దేవ్ (1983) ఈ ఘనత సాధించారు.