వరల్డ్ కప్ గెలిచి ఊపు మీద ఉన్న టీమిండియాకు షాక్ తగిలింది. వరల్డ్ కప్ కు అర్హత సాధించలేని జింబాబ్వే.. వరల్డ్ ఛాంపియన్ భారత్ కు బిగ్ షాక్ ఇచ్చింది. సీనియర్ల రిటైర్మెంట్.. స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వడంతో జింబాబ్వే టూర్ కు కుర్రాళ్లను ఎంపిక చేశారు. అయితే బరిలోకి దిగిన కొత్త తరం టీమిండియా తొలి టీ20 మ్యాచ్‌లోనే బోల్తా కొట్టింది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో బ్యాటర్లు ఘోరంగా ఫెయిల్ కావడంతో.. శనివారం (జూలై 6) జింబాబ్వేతో జరిగిన తొలి పోరులో 13 రన్స్ తేడాతో ఓడింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే 1–0 లీడ్‌లో నిలిచింది.
ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ లో రాణించినా బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. ఏ ఒక్కరూ బాధ్యతగా ఆడకుండా అనవసర షాట్లకు ప్రయత్నించి ఔటయ్యారు. కెప్టెన్ శుభమాన్ గిల్ మినహాయిస్తే టాపార్డర్, మిడిల్ ఆర్డర్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. పసికూన అని తక్కువ అంచనా వేసిన టీమిండియా తగిన మూల్యం చెల్లించుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (జూలై 7) రెండో టీ20 మ్యాచ్ కు సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్ ముగ్గురు ప్లేయర్లకు కీలకంగా మారింది. తొలి మ్యాచ్ లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ నేడు జరగబోయే మ్యాచ్ ఆడకపోతే బెంచ్ కు పరిమితం కాక తప్పదు.
ఈ ముగ్గురు తొలి టీ20 లో విఫలమయ్యారు. అభిషేక్ శర్మ డకౌట్ కాగా.. పరాగ్ రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఇక ధృవ్ జురెల్ 14 బంతులాడి 6 పరుగులకే పెకిలియన్ చేరాడు. ఐపీఎల్ లో అదరగొట్టిన ఈ ముగ్గురు తమ అంతర్జాతీయ తొలి మ్యాచ్ లో విఫలమయ్యారు. మూడో టీ20కు జట్టులో సంజు శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ జట్టులో చేరనున్నారు. స్క్వాడ్ లో చేరితే వీరికి తుది జట్టులో చోటు ఖాయం. అదే జరిగితే అభిషేక్ శర్మ, పరాగ్, జురెల్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం కష్టం.