- రెండో టీ20లో 100 రన్స్ తేడాతో
- జింబాబ్వేపై ఇండియా విక్టరీ
- రాణించిన రుతురాజ్, రింకూ
హరారే: తొలి టీ20 పరాజయానికి టీమిండియా కుర్రాళ్లు వెంటనే ప్రతీకారం తీర్చుకున్నారు. అభిషేక్ శర్మ (47 బాల్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) మెరుపు సెంచరీకి తోడు రుతురాజ్ గైక్వాడ్ (47 బాల్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 77 నాటౌట్), రింకూ సింగ్ (22 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) దుమ్మురేపడంతో.. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఇండియా 100 రన్స్ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. టాస్ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 234/2 స్కోరు చేసింది. టీ20ల్లో జింబాబ్వేపై ఇండియాకు ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఉన్న 186 రన్స్‌ను అధిగమించింది. తర్వాత జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 రన్స్‌కే ఆలౌటైంది. వెస్లీ మదెవెరె (43) టాప్ స్కోరర్. అభిషేక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 బుధవారం జరుగుతుంది.
ఆఖరి పది ఓవర్లలో 160 రన్స్
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాను తొలి 10 ఓవర్లలో జింబాబ్వే బౌలర్లు కట్టడి చేశారు. రెండో ఓవర్‌లోనే శుభ్‌మన్ గిల్ (2)ను ఔట్ చేయడంతో పాటు అభిషేక్, రుతురాజ్‌ను అడ్డుకున్నారు. దీంతో పవర్‌ప్లేలో 36/1 స్కోరే వచ్చింది. ఫీల్డింగ్ విస్తరించిన తర్వాత రుతురాజ్ మూడు ఫోర్లు, అభిషేక్ ఓ ఫోర్, సిక్స్ కొట్టడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 38 రన్స్ వచ్చాయి.
దీంతో ఓవర్లకు ఇండియా 74/1తో నిలిచింది. అయితే, సెకండాఫ్‌లో అభిషేక్ విశ్వరూపం చూపెట్టాడు. 11వ ఓవర్లో అభిషేక్ 4, 6, 4, 6, 4తో 28 రన్స్ దంచి హిట్టింగ్‌ను మరో మెట్టు ఎక్కించాడు. ఈ క్రమంలో 33 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. 12వ ఓవర్‌లో 8 రన్సే రాగా, 13వ ఓవర్లో అభిషేక్ 6, 4, రుతురాజ్ ఫోర్‌తో 16 రన్స్ రాబట్టారు. 14వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్ కొట్టిన అభిషేక్ 46 బాల్స్‌లోనే సెంచరీ ఫినిష్ చేశాడు.
కానీ లాస్ట్ బాల్‌కు ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 137 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. రింకూ సింగ్ వచ్చి రావడంతో సిక్స్‌తో బాదుడు షురూ చేశాడు. 18వ ఓవర్‌లో రుతురాజ్ 4, 6, 4, 4తో 20 రాబట్టాడు. ఆ వెంటనే మరో రెండు సిక్స్‌లు కొట్టిన రింకూ ఆఖరి ఓవర్లో 4, 6, 6 బాదాడు. రింకూ, రుతురాజ్ మూడో వికెట్‌కు 36 బాల్స్‌లోనే 87 రన్స్ జోడించారు. చివరి 10 ఓవర్లలో160 రన్స్ రావడంతో ఇండియా భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.
బౌలర్లు సూపర్..
ఛేజింగ్‌లోటీమిండియా బౌలర్లు సూపర్ సక్సెస్ అయ్యారు. ముకేశ్ కుమార్ (3/37), అవేశ్ ఖాన్ (3/15) స్టార్టింగ్ నుంచే జింబాబ్వే బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. దీంతో ఇన్నింగ్స్ మూడో బాల్‌కు ఇన్నోసెంట్ (0)తో మొదలైన వికెట్ల పతనం వేగంగా సాగింది. ఆరంభంలో మదెవెరె, మధ్యలో బెన్నెట్ (26), చివర్లో ల్యూక్ జోంగ్వి (33) పోరాడారు. కానీ రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో డియాన్ మేయర్స్ (0), సికందర్ రజా (4), క్యాంప్‌బెల్ (10), మదాండె (0), మసకద్జా (1), ముజరబాని (2) వికెట్లు పడటంతో జింబాబ్వే ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పవర్‌ప్లేలో 58/4తో కష్టాల్లో పడిన జింబాబ్వే సగం ఒవర్లకు72/5తో నిలిచింది. బెన్నెట్‌తో రెండో వికెట్‌కు
36 రన్స్ జోడించిన మదెవెరె.. చివర్లో జోంగ్వితో ఎనిమిదో వికెట్‌కు 41 రన్స్ జత చేసినా జింబాబ్వేకు భారీ ఓటమి తప్పలేదు.
టీ20ల్లో ఆడిన రెండో ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన అభిషేక్ ఐసీసీ ఫుల్ మెంబర్స్ టీమ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్. హ్యాట్రిక్ సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న తొలి ఇండియన్‌గా నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 234/2 (అభిషేక్ 100, రుతురాజ్ 77*, మసకద్జా 1/29).
జింబాబ్వే: 18.4 ఓవర్లలో 134 ఆలౌట్ (మదెవెరె 43, జోంగ్వి 33, అవేశ్ 3/15).