టీమిండియాలో ఛాన్స్ రావాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోకపోతే జట్టులో వేగంగా ఛాన్స్ కోల్పోతారు. అయితే పంజాబ్ ప్లేయర్ అభిషేక్ శర్మ మాత్రం ఇందుకు మినహాయింపు. అతను వరుసగా విఫలమవుతున్నా తుది జట్టులో చోటు కల్పిస్తున్నారు. అతడి మీద నమ్మకంతో ప్రతి మ్యాచ్ లో అవకాశం ఇస్తున్నారు. ఐపీఎల్ లో పవర్ హిట్టింగ్ తో భారత జట్టులో స్థానం దక్కించుకున్న ఈ యువ ప్లేయర్.. భారత తరపున ఘోరంగా విఫలమవుతున్నాడు.
జింబాబ్వేపై మెరుపు సెంచరీ చేసి ఒక్కసారిగా ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ లోనూ కనీసం 20 పరుగులు చేయలేకపోయాడు. అతని చివరి 7 ఇన్నింగ్స్ లు చూసుకుంటే కనీసం 10 బంతులు కూడా ఆడలేకపోయాడు. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ తర్వాత అభిషేక్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 0, 10, 14, 16, 15, 4, 7 రన్స్ మాత్రమే చేశాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 7 పరుగులే చేసి ఔటయ్యాడు.
ఆదివారం (నవంబర్ 10) రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేసే చాన్స్ లేదు కాబట్టి అభిషేక్‌కు ఇది ఆఖరి అవకాశంగానే చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో విఫలమైతే అతను మరోసారి భారత జట్టులో అవకాశం దక్కక పోవచ్చు. ఒకవేళ టాప్ ఆర్డర్‌లో అతన్ని కొనసాగించాలంటే ఈ పెర్ఫామెన్స్ ఏమాత్రం సరిపోదు. జైశ్వాల్, గిల్, గైక్వాడ్, సంజు శాంసన్ రూపంలో తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఎలా ఆడతాడో చూడాలి.