IND vs ZIM 2024: సెంచరీతో శివాలెత్తిన అభిషేక్.. జింబాబ్వే టార్గెట్ 235

IND vs ZIM 2024: సెంచరీతో శివాలెత్తిన అభిషేక్.. జింబాబ్వే టార్గెట్ 235

తొలి టీ20లో ఓడిపోయిన తర్వాత టీమిండియా బ్యాటర్లు తమ విశ్వరూపాన్ని చూపించారు. హరారే వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో చెలరేగి ఆడారు. కెప్టెన్ గిల్ (2) విఫలమైనా.. అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 46 బంతుల్లో సెంచరీ చేసి పసికూన జింబాబ్వే బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 8 సిక్సర్లున్నాయి. అభిషేక్ తో పాటు గైక్వాడ్(47 బంతుల్లో 77: 11 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్లోనే కెప్టెన్ గిల్ కేవలం రెండు పరుగులే చేసి ఔటయ్యాడు. పవర్ ప్లే లో 6 ఓవర్లలో భారత్ కేవలం 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో తొలి టీ20 రిపీట్ అవుతుందేమో అనే అనుమానం కలిగింది. అయితే మనోళ్లు పవర్ ప్లే తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చారు. గైక్వాడ్ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే అభిషేక్ బౌండరీలతో హోరెత్తించాడు. దీంతో స్కోర్ వేగం ఒక్కసారిగా దూసుకెళ్లింది. 9 ఓవర్లో 14, పదో ఓవర్లో 11 పరుగులు రాబట్టిన టీమిండియా 11 ఓవర్లో ఏకంగా 28 పరుగులు బాదారు. 

సెంచరీ చేసిన తర్వాత బంతికే అభిషేక్ శర్మ ఔటైనా.. గైక్వాడ్ తనదైన శైలిలో చెలరేగాడు. బౌండరీలతో చెలరేగుతూ హాఫ్ సెంచరీ 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో రింకూ సింగ్(22 బంతుల్లో 48: 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజురుభాని, మసకద్జ్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత్ చివరి 12 ఓవర్లలో ఏకంగా 185 పరుగులు చేయడం విశేషం.