కాంగ్రెస్ లో మరో వాయిస్

కాంగ్రెస్ లో మరో వాయిస్

దాదాపు రెండున్నర నెలల పాటు కాంగ్రెస్ కు లీడర్ అంటూ ఎవరూ లేకుండా పోయారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి  బాధ్యత వహిస్తూ  రాహుల్ రాజీనామా చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ లీడర్లు ఎంత ప్రయత్నించినా ఆయన పంతం విడవకపోవడంతో లేటెస్ట్ గా కాంగ్రెస్ తాత్కాలిక  ప్రెసిడెంట్ గా  సోనియా గాంధీని  ఆ పార్టీ నాయకులు ఎంపిక చేసుకోవడం తెలిసిందే. దాదాపు రెండు నెలలు పార్టీ మీద ఎవరి కంట్రోల్ లేకపోవడంతో పెద్ద లీడర్లు కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మొదలు పెట్టారు.

సోనియా పార్టీ పగ్గాలు చేపట్టాక కూడా పార్టీ పరిస్థితిలో మార్పు రాలేదు. పార్టీ లో కొందరు వ్యవహరిస్తున్న తీరు చూస్తే  కాంగ్రెస్ పార్టీలోనే మరో కాంగ్రెస్ పార్టీ ఉందా ? అనే అనుమానాలు వస్తున్నాయి. అనేక కీలక అంశాలపై  పార్టీ వైఖరికి వ్యతిరేకంగా  ఈ నాయకులు మాట్లాడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు అనుకూలంగా మాట్లాడటం వీరి స్పెషాలిటీ అని చెప్పొచ్చు. చిదంబరం అరెస్టు సంఘటన దీనికి తాజా రుజువు.

కాంగ్రెస్ లోనే వేర్వేరు అభిప్రాయాలు

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసినా దానిని అడ్డంగా విమర్శించడం పార్టీకి మంచిది కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్​. ప్రధాని మోడీని ప్రజల ముందు ఓ పెద్ద రాక్షసుడిలా చిత్రీకరించాలని చేసే ప్రయత్నం కరెక్ట్ కాదన్నారు. చిదంబరం అరెస్టు తదితర పరిణామాలను ముందూ వెనకా ఆలోచించకుండా‘‘ ప్రతిపక్షంలో ఉన్నాం కదా ” అని విమర్శించే పద్ధతి పార్టీకి మేలు చేయదని ఆయన క్లియర్ గానే చెప్పారు. మోడీ ప్రభుత్వం చేసే  ప్రతి పనిని నెగెటివ్ ధోరణితో చూడటం మానుకోవాలన్నారు. 2014 నుంచి 2019 వరకు మోడీ ప్రభుత్వం చేసిన పనులను చూసే ప్రజలు లేటెస్ట్ లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి పట్టం కట్టారన్నారు జై రాం రమేష్. చీటికి మాటికి మోడీ ని తప్పుపట్టడమే పనిగా పెట్టుకోవడం వల్ల  ప్రజలకు కాంగ్రెస్  దూరమవుతుందన్న  సంకేతాలు ఇచ్చారు.

జైరాం రమేష్ కు అభిషేక్ మనుసింఘ్వి మద్దతు

సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కు పార్టీలోని మరో సీనియర్, కాంగ్రెస్ ప్రతినిధి  అభిషేక్ మనుసింఘ్వి మద్దతు లభించింది. చిదంబరం ఇష్యూ పై  జైరాం రమేష్ అభిప్రాయాలు కరెక్టేనని తాను కూడా భావిస్తున్నట్లు అభిషేక్ మనుసింఘ్వి చెప్పారు.  ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉందనడంలో తనకు రెండో అభిప్రాయం లేదన్నారు అభిషేక్. అయితే విమర్శ అనేది ఫెయిర్ గా ఉండాలన్నారు.

చిదంబరం ఇష్యూపై  కాంగ్రెస్ తాత్కాలిక ప్రెసిడెంట్ సోనియా గాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సీరియస్ గా ఉంటే మిగతా లీడర్లు  చాలా మంది ఇష్యూకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు పార్టీ  వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చిదంబరం ఇష్యూ నే  కాదు గతంలో కూడా కీలక అంశాలపై  కాంగ్రెస్ పార్టీ లో తలోమాట వచ్చింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కు  ప్రత్యేక హక్కులు కట్టబెట్టిన ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ లీడర్లు తలోమాట మాట్లాడారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న  గులాం నబీ ఆజాద్,  ప్రభుత్వ నిర్ణయాన్ని  కాంగ్రెస్ పక్షాన  తాము వ్యతిరేకిస్తున్నట్లు  చెప్పారు. కాంగ్రెస్ పార్టీ  వైఖరి ఇలా ఉంటే  అదే పార్టీకి చెందిన చాలా మంది నాయకులు ఆర్టికల్ 370 రద్దును ఓపెన్ గానే పొగిడారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం పై కాంగ్రెస్ తీసుకున్న వైఖరికి నిరసనగా రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్ విప్ భువనేశ్వర్ కలితా రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల ఫీలింగ్స్ కు పూర్తి వ్యతిరేకమైన వైఖరి కాంగ్రెస్ తీసుకుందని ఆయన కామెంట్ చేశారు. ఇలాంటి వైఖరి వల్ల ప్రజలకు కాంగ్రెస్ మరింతగా దూరమవుతుందని పార్టీ పెద్దలను హెచ్చరించారు కూడా.  మోడీ సర్కార్ నిర్ణయానికి  తాను జై కొడుతున్నట్లు మరో కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ చెప్పారు.మరో సీనియర్ కాంగ్రెస్ లీడర్ దీపేందర్ హుడా కూడా కేంద్ర  ప్రభుత్వ నిర్ణయాన్ని  పొగిడారు. 21వ శతాబ్దంలో కూడా కాశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పించాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నేత జనార్దన్ ద్వివేది కూడా పార్టీ  వైఖరిని తప్పు పట్టారు. మహారాష్ట్రకు చెందిన యువ కాంగ్రెస్​ నేత మిలింద్​ దేవరా కూడా ఆర్టికల్​ 370 రద్దును సమర్ధించారు.

దూకుడు తగ్గించిన మమతా బెనర్జీ

ఇదిలాఉంటే చిదంబరం ఇష్యూ లో కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా పూర్తిగా కలిసి రాలేదు. ఎంతవరకు రియాక్ట్ కావాలో అంతవరకే రియాక్ట్ అయ్యాయి. అరెస్టు చేసిన పద్ధతి కరెక్ట్ కాదన్నాయి తప్ప అరెస్టును తప్పు పట్టే ప్రయత్నం చేయలేదు. చిదంబరం ఇష్యూను నెత్తికెత్తుకోవడానికి ఏ అపోజిషన్ పార్టీ  ఉత్సాహం చూపలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ ఏకాకిగా మారింది. సహజంగా బీజేపీ ప్రభుత్వం పై  ఒంటికాలి మీద లేచే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, చిదంబరం ఇష్యూపై  ఆచితూచి వ్యవహరించారు.“చిదంబరం వంటి సీనియర్ లీడర్ ను అరెస్టు చేసే పద్దతి ఇది కాద’’న్నారు. అంతేకానీ ఎక్కడా  మోడీ ప్రభుత్వం పై  విమర్శలు చేయలేదు. ఇష్యూ లోపలకు వెళ్లలేదు.  “ఐఎన్ ఎక్స్ మీడియా సంస్థతో చిదంబరానికి సంబంధం ఉందా ? లేదా? అనే విషయం  లోతుల్లోకి  నేను వెళ్లడం లేదు. పెద్దాయనను అరెస్టు  చేసిన  పద్ధతి మాత్రం బాగా లేదు”అని మమత అన్నారు.

ఆచితూచి స్పందించిన  ఎంకే స్టాలిన్

తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ మిత్రపక్షం  డీఎంకే  కూడా తమ సొంత రాష్ట్రానికి చెందిన చిదంబరం ఇష్యూ పై ఆచితూచి స్పందించింది. చిదంబరం ఇంటి గోడ దూకి లోపలకు వెళ్లి సీబీఐ అధికారులు అరెస్టు చేయడాన్ని మాత్రమే పార్టీ చీఫ్ స్టాలిన్  తప్పుపట్టారు. అంతకుమించి మోడీ ప్రభుత్వం పై  దాటిగా ఒక్క విమర్శ కూడా చేయలేదు. కాంగ్రెస్ కు మిత్రపక్షాల కొదవ లేదు. అయితే ఈ పార్టీలేవీ ఈ ఇష్యూ పై  మాట్లాడటానికి ఉత్సాహం చూపలేదు. ‘ వేచి చూద్దాం ’ అనే ధోరణితో వ్యవహరిస్తున్నాయి.

మిత్రపక్షాలు ఎందుకు దూరమయ్యాయి ?

మిత్రపక్షాలకు చెందిన కొంతమంది  ప్రముఖులు కేసుల్లో చిక్కుకున్నప్పుడు  కాంగ్రెస్ పార్టీ వారికి ఎలాంటి సాయం అందించలేదన్న  విమర్శ రాజకీయవర్గాల్లో  వినిపిస్తోంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి,  రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నేత  లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కేసులో  ఇరుక్కున్నప్పుడు  కాంగ్రెస్ పెద్దలు ఆయనను పూర్తిగా వదిలేశారంటున్నారు ఎనలిస్టులు. అలాగే  2 జీ స్పెక్ట్రమ్  కేసులో  డీఎంకే  సీనియర్లు ఏ రాజా, కనిమొళి చిక్కుకున్నప్పుడు  కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. దీంతో  చిదంబరం ఇష్యూపై  కేంద్రంతో  పోరాటం  చేయడానికి  మిత్రపక్షాలేవీ  కాంగ్రెస్ కు అండగా నిలబడటం లేదని ఎనలిస్టులు అంటున్నారు.

పాలిటిక్స్ లో  కొత్త ట్రెండ్

అపోజిషన్ అంటే ఎప్పుడూ విమర్శలే చేయాలన్న ఆనవాయితీని కాంగ్రెస్ లీడర్లు ఇప్పటికైనా మానుకోవడం రాజకీయాల్లో  కొత్త ట్రెండ్ గానే చెప్పుకోవాలి. మంచి జరిగినప్పుడు  కూడా దుమ్మెత్తి పోయాలన్న పాత పద్ధతి వీళ్లు వదిలి పెట్టేయడం చూశాక ఇప్పుడైనా పార్టీ చీఫ్ సోనియా, మాజీ చీఫ్ రాహుల్ మారతారేమో  చూడాలి.