- భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
- రామనామస్మరణతో మార్మోగిన భద్రాద్రి
భద్రాచలం, వెలుగు : ఓ వైపు భక్తుల రామనామస్మరణ, మరో వైపు పటాకుల వెలుగుల మధ్య భద్రాద్రి రామయ్య తెప్పోత్సవాన్ని గురువారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ముందుగా ఉదయం గోదావరి నుంచి తీర్ధబిందెను తీసుకొచ్చి రామయ్యకు అభిషేకం, స్నపన తిరుమంజనం నిర్వహించారు. చతుర్వేద, నాళాయర దివ్యప్రబంధ పారాయణం చేశాక తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవాన్ని జరిపించారు. సాయంత్రం దర్బారుసేవ తర్వాత స్వామివారిని పల్లకీలో ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకొచ్చారు.
హంసవాహనానికి ప్రత్యేక పూజలు చేసి, ప్రోక్షణ జలాలతో శుద్ధి చేశారు. లాంచీ నడిపే సరంగుకు స్వామివారి శేషవస్త్రాలు అందజేసి, గోదావరికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. ఆ తర్వాత స్వామివారిని హంసవాహనంపై అధిష్ఠింపజేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వేదపఠనం నిర్వహించారు. ప్రసాద నివేదన, బలిహరణం జరిపారు. తర్వాత గోదావరిలో సవ్యదిశలో ఐదు సార్లు జలవిహారం నిర్వహించారు. తెప్పోత్సవానికి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఈవో రమాదేవి, భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ హాజరయ్యారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోదావరి కరకట్ట, ఇసుక తిన్నెలపై కూర్చొని రాముడి తెప్పోత్సవాన్ని వీక్షించారు. నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భద్రాచలంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తరద్వారానికి ఎదురుగా ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వీఐపీల సెక్టార్లతో పాటు మిథిలాప్రాంగణంలో భక్తులు కూర్చుకునేలా చర్యలు చేపట్టారు.