రామయ్యకు స్వర్ణ పుష్పార్చన

భద్రాచలం, వెలుగు :  శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం, స్వర్ణ పుష్పార్చనలు జరిగాయి. మూలవరులకు సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించి, ఆవుపాలు, నెయ్యి, తేనె, పంచదార, పెరుగులతో, సమస్త నదీజలాలు, సముద్ర జలాలతో తిరుమంజన నిర్వహించారు.

మంజీరా(పసుపు ముద్ద)లతో కూడా అభిషేకం చేసి భక్తులకు పంపిణీ చేశారు. తర్వాత బంగారు పుష్పాలతో సీతారామయ్యకు అర్చన జరిగింది. సోమవారం జరిగే విశ్వరూప సేవ కారణంగా బేడా మండపంలో నిర్వహించాల్సిన నిత్య కల్యాణాన్ని చిత్రకూట మండపంలో చేశారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. 

లక్ష తులసీ అర్చన

భద్రాద్రి దివ్యక్షేత్రంలోని గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో ఆదివారం ఏకాదశి వేళ లక్ష తులసీ అర్చన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సినీ నటి మాధవీలత ఈ పూజల్లో పాల్గొన్నారు.