అభిషేక్‌‌‌‌ అదుర్స్‌‌‌‌..తొలి టీ20లో ఇండియా ఘన విజయం

అభిషేక్‌‌‌‌ అదుర్స్‌‌‌‌..తొలి టీ20లో ఇండియా ఘన విజయం
  • 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌‌‌పై గెలుపు
  • రాణించిన వరుణ్‌‌‌‌, శాంసన్‌‌‌‌
  • బట్లర్‌‌‌‌ పోరాటం వృథా

కోల్‌‌‌‌కతా : ఇంగ్లండ్‌‌‌‌తో ఐదు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌లో ఇండియా బోణీ చేసింది. చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ శర్మ (34 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 8 సిక్స్‌‌‌‌లతో 79) దుమ్మురేపడంతో.. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌‌‌ను ఓడించి 1–0 లీడ్‌‌‌‌లో నిలిచింది. టాస్‌‌‌‌ నెగ్గిన ఇండియా ఫీల్డింగ్‌‌‌‌ ఎంచుకోగా, బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌‌‌ 20 ఓవర్లలో 132 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. కెప్టెన్‌‌‌‌ జోస్‌‌‌‌ బట్లర్‌‌‌‌ (44 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 68) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తర్వాత ఇండియా 12.5 ఓవర్లలో 133/3 స్కోరు చేసి నెగ్గింది. వరుణ్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం చెన్నైలో జరుగుతుంది. 

బట్లర్‌‌‌‌ ఒక్కడే.. 

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌‌‌ను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు సూపర్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అయ్యారు. ఓ ఎండ్‌‌‌‌లో బట్లర్‌‌‌‌ ఒంటరి పోరాటం చేసినా రెండో ఎండ్‌‌‌‌లో వరుస విరామాల్లో వికెట్లు తీసి స్కోరును అడ్డుకున్నారు. ఇన్నింగ్స్‌‌‌‌ మూడో బాల్‌‌‌‌కు ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌ (0)ను, 3వ ఓవర్‌‌‌‌లో బెన్‌‌‌‌ డకెట్‌‌‌‌(4)ను  ఔట్‌‌‌‌ చేసి అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ (2/17)  అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. 17/2తో స్కోరుతో ఉన్న ఇన్నింగ్స్‌‌‌‌ను బాగు చేసే బాధ్యత తీసుకున్న బట్లర్‌‌‌‌ అద్భుతంగా ఆడాడు. హ్యారీ బ్రూక్‌‌‌‌(17) కాసేపు అండగా నిలవడంతో పవర్‌‌‌‌ప్లేలో ఇంగ్లండ్‌‌‌‌ 46/2తో తేరుకుంది. 

కానీ ఎనిమిదో ఓవర్‌‌‌‌లో వరుణ్‌‌‌‌ (3/23) మూడు బాల్స్‌‌‌‌ తేడాలో బ్రూక్‌‌‌‌, లివింగ్‌‌‌‌స్టోన్‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌కు పంపడంతో ఇంగ్లండ్‌‌‌‌ 83 రన్స్‌‌‌‌కే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బట్లర్‌‌‌‌ భారీ షాట్లకు తెరలేపినా.. అవతలివైపు సరైన సహకారం అందలేదు. 12వ ఓవర్‌‌‌‌లో హార్దిక్‌‌‌‌ (2/42).. జాకబ్‌‌‌‌ బెథెల్‌‌‌‌ (7)ను ఔట్‌‌‌‌ చేయగా, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (2/22) తన వరుస ఓవర్ల (14, 16)లో జెమీ ఓవర్టన్‌‌‌‌ (2), గస్‌‌‌‌ అట్కిన్సన్‌‌‌‌ (2) వికెట్లు తీశాడు. 

34 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన బట్లర్‌‌‌‌ను రెండోసారి బౌలింగ్‌‌‌‌కు దిగిన వరుణ్‌‌‌‌ 17వ ఓవర్‌‌‌‌లో  ఔట్‌‌‌‌ చేయడంతో ఇంగ్లండ్‌‌‌‌ 109/8తో నిలిచింది. చివర్లో ఆర్చర్‌‌‌‌ (12), ఆదిల్‌‌‌‌ రషీద్‌‌‌‌ (8 నాటౌట్‌‌‌‌), మార్క్‌‌‌‌ వుడ్‌‌‌‌ (1) నిరాశపర్చారు. ఇన్నింగ్స్‌‌‌‌లో ఎనిమిది మంది సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితం కావడంతో ఇంగ్లండ్‌‌‌‌ తక్కువ స్కోరే చేసింది. 

ALSO READ : ఆసీస్ బౌలర్ ఉదారత.. కోహ్లీ, బుమ్రాలు సంతకం చేసిన బ్యాట్లు ఛారిటీకి విరాళం

సిక్సర్లే.. సిక్సర్లు

ఛేజింగ్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌, శాంసన్‌‌‌‌ (26) ఇండియాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్‌‌‌‌లో ఒక్క రన్నే వచ్చినా రెండో ఓవర్‌‌‌‌లో శాంసన్‌‌‌‌ 4, 4, 6, 4, 4తో 22 రన్స్‌‌‌‌ దంచాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ 4, 6తో రెచ్చిపోయాడు. అయితే ఐదో ఓవర్‌‌‌‌లో ఆర్చర్‌‌‌‌ (2/21) నాలుగు బాల్స్‌‌‌‌ తేడాలో శాంసన్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేసి షాకిచ్చాడు. ఫోర్‌‌‌‌తో ఖాతా తెరిచిన తిలక్‌‌‌‌ వర్మ (19 నాటౌట్‌‌‌‌) నిలకడగా ఆడాడు. ఆరో ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ 6, 6, 4తో 18 రన్స్‌‌‌‌ రాబట్టడంతో పవర్‌‌‌‌ప్లేలో ఇండియా 63/2 స్కోరు చేసింది. 

ఫీల్డింగ్‌‌‌‌ పెరిగిన తర్వాత కూడా విజృంభించిన అభిషేక్‌‌‌‌ 4, 6, 6, 6, 4తో 20 బాల్స్‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇండియా స్కోరు 10 ఓవర్లలో 100/2కి చేరింది. 11వ ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ 6, 4, 4, ఆ వెంటనే మరో సిక్స్‌‌‌‌ బాది ఔటయ్యాడు. దీంతో మూడో వికెట్‌‌‌‌కు 42 బాల్స్‌‌‌‌లోనే 84 రన్స్‌‌‌‌ జతయ్యాయి. తర్వాత తిలక్‌‌‌‌ వర్మ, హార్దిక్‌‌‌‌ పాండ్యా (3 నాటౌట్‌‌‌‌) విజయానికి అవసరమైన రన్స్‌‌‌‌ జోడించారు. 

1ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (97), యుజ్వేంద్ర చహల్‌‌‌‌ (96)ను అధిగమించాడు.

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌‌‌‌ : 20 ఓవర్లలో 132 ఆలౌట్‌‌‌‌(బట్లర్‌‌‌‌ 68, వరుణ్‌‌‌‌ 3/23). ఇండియా : 12.5 ఓవర్లలో 133/3 (అభిషేక్‌‌‌‌ 79, శాంసన్‌‌‌‌ 26, ఆర్చర్‌‌‌‌ 2/21).